అతిభయంకరమైన కరువు ముంగిట గాజా- హెచ్చరించిన ఐపిసి

న్యూయార్క్‌: ఇప్పటికే ఆహార సంక్షోభంతో అల్లాడుతున్న గాజాను రానున్న రోజుల్లో అతి భయంకరమైన కరువు పరిస్థితులు నెలకొనబోతున్నాయని ఇంటిగ్రేటెడ్‌ ఫుడ్‌ సెక్యూరీటీ ఫేజ్‌ క్లాసిఫికేషన్‌ (ఐపిసి) మెచ్చరించింది. డజనుకుపైగా దేశాలు, ఐరాస సహాయక సంస్థలు, సహాయక బృందాలు, ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలతో కూడిన ఐపిసి గాజాలో పరిస్థితిపై సోమవారం ఒక నివేదిక విడుదలజేసింది. గాజాలో 22 లక్షల మంది ఆహారం అందక అల్లాడుతున్నారు. పసిపిల్లలు, గర్భిణుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. ఇప్పటికే 5 లక్షల మంది ఆకలి రక్కసి కోరల్లో చిక్కుకున్నారు. ఇజ్రాయిల్‌ వరుస బాంబు దాడులతో దక్షిణ గాజాలోని రఫా, తదితర ప్రాంతాలకు మానవతా సాయం నిలిచిపోయింది. దీంతో వారి పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని ఐపిసి ఆందోళన వ్యక్తం చేసింది. జబ్బులు, జ్వరాలతో బాధపడుతున్న పిల్లలకు ఎలాంటి మందులు అందక చనిపోతున్నారు. గర్భిణీలుగా ఉండగా సరైన పోషకాహారం అందక పోవడం వల్ల వారికి పుట్టే పిల్లలు తక్కువ బరువు కలిగివుండడం, ఎదుగుదల లేక పోవడం వంటి సమస్యలు ఉన్నాయి.దీనిపై అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని ఐపిసి పేర్కొంది.

➡️