శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్,కెన్యాల జాబితాలో ఇరాన్‌

Dec 15,2023 16:20 #Indian travellers, #Iran, #Visa

తెహ్రాన్‌ :   భారత్‌కు వీసా ఫ్రీ అవకాశం కల్పించిన శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్, కెన్యాల జాబితాలో ఇరాన్‌ కూడా చేరింది. భారత పర్యాటకులను ప్రోత్సహించేందుకు వీసా ఫ్రీ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం విడుదల చేసిన అధికార ప్రకటనలో ఇరాన్‌ తెలిపింది. భారత్‌, రష్యా, సౌదీ అరేబియా, ఖతార్‌, జపాన్‌ మరియు యుఎఇతో సహా 33 దేశాలకు వీసా మినహాయింపునివ్వాలని భావిస్తున్నట్లు పేర్కొంది.

ఈ నిర్ణయం అంతర్జాతీయ సమాజం పట్ల ఇరాన్‌ వైఖరికి నిదర్శనమని ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి ఎజ్జతొల్లా జర్ఘామి పేర్కొన్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో ఇరాన్‌ ప్రభుత్వం 33 దేశాల పర్యాటకులకు వీసా నిబంధనలను సడలించాలని నిర్ణయించిందని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ సమాజానికి ఇరాన్‌ పట్ల ఉన్న ఆలోచనా ధోరణిని ఇది మారుస్తుందని నమ్ముతున్నామని జర్ఘామి తెలిపారు.

ప్రస్తుతం భారత్‌ నుండి దౌత్య వ్యవహారాల కోసం ఇరాన్‌ వెళ్లే వారికి మాత్రమే వీసా అనుమతి నుంచి మినహాయింపు ఉంది. తాజాగా పర్యాటకులను కూడా ఈ జాబితాలో చేర్చింది. ఇప్పటికే టర్కీ, అజర్‌బైజాన్‌, ఒమన్‌, చైనా, అర్మేనియా, లెబనాన్‌, సిరియా దేశాల పర్యాటకులకు వీసా నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వీసా అవసరం లేకుండా ఇరాన్‌లో పర్యటించేగలిగే దేశాల సంఖ్య 45కి చేరింది.

➡️