లక్షలాదిమందితో ఇరాన్‌ అధ్యక్షుని అంతిమయాత్ర

టెహరాన్‌ : అనుమానాస్పద రీతిలో హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసి అంతిమయాత్ర బుధవారం జరిగింది. లక్షలాదిమంది ప్రజలు ఈ అంతిమయాత్రలో పాల్గని తమ ప్రియతమ నేతకు కడసారిగా నివాళులర్పించారు. తొలుత ఈ ప్రమాదంలో మరణించిన వారి భౌతిక కాయాలను టెహరాన్‌ యూనివర్శిటీలో వుంచారు. ఇరాన్‌ మత పెద్ద ఆయతుల్లా అలీ ఖమేని నేతృత్వంలో అక్కడ సంస్మరణ సభ జరిగింది. రైసి గురించి మాట్లాడుతూ ఖమేని ప్రార్ధనలు చేశారు. ఆయన వెళ్ళిన వెంటనే ప్రజలను లోపలకు అనుమతించారు. ఇరాన్‌ తాత్కాలిక అధ్యక్షుడు మహ్మద్‌ మొక్బర్‌ ఆ శవపేటిక పక్కనే నిలబడి కంటతటి పెట్టడం కనిపించింది. అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శవపేటికను బయట ట్రక్కుపై ఎక్కించిన అనంతరం అంతిమయాత్ర ప్రారంభమైంది. భారత్‌ తరపున ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌కర్‌ ఈ సంస్మరణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన రైసికి ఇతర నేతలకు నివాళులు అర్పించారు. హమాస్‌ నేత ఇస్మాయిల్‌ హనియె కూడా ఈ కార్యక్రమంలో పాల్గన్నారు. ఆయన మాట్లాడుతూ, సంతాపం తెలియచేసేందుకు పాలస్తీనియన్ల తరపున తానిక్కడకు వచ్చానని చెప్పారు. రంజాన్‌ సమయంలో టెహరాన్‌లో రైసితో జరిపిన సమావేశం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. పాలస్తీనా సమస్య ముస్లిం దేశాల్లో కీలకమైనదిగా వుందని ఆయన వ్యాఖ్యానించారని చెప్పారు. తమ మాతృభూమి విముక్తి కోసం పోరాడుతున్న పాలస్తీనియన్ల పట్ల ముస్లిం ప్రపంచం తన బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు.

➡️