ఇజ్రాయిల్‌ భీకర దాడులు

Jan 6,2024 10:48 #Attacks, #high tension, #Israel
  • జోర్డాన్‌లో పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు
  • లెబనాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు

గాజా : గాజాలో ఇజ్రాయిల్‌ తన దాడులను మరింత ఉధృతం చేసింది. ప్రజలందరూ దక్షిణ ప్రాంతం నుండి వలస వెళ్లిపోయేలా శరణార్ధుల శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగుతున్నాయి. డేర్‌ ఎల్‌ బాలా, నుస్రత్‌, అల్‌ మఘజి, బురెజి శరణార్ధ శిబిరాలపై భారీగా బాంబు దాడులు జరిగాయి. ఖాన్‌ యూనిస్‌ నగరంలో 32మంది మరణించగా, రఫాలో ఐదుగురు చనిపోయారు. గత మూడు నెలల్లో చిన్నారులు మహిళలుసహా 22,600మంది మరణించగా, 58వేల మంది గాయపడ్డారు. ఇజ్రాయిల్‌ ట్యాంకులు ప్రజలను దారుణంగా చంపివేస్తున్నాయి.

తొలుత సెంట్రల్‌ గాజా సురక్షిత ప్రాంతమని ఇజ్రాయిల్‌ ఆర్మీ ప్రకటించింది గాజా నగరం, ఉత్తర ప్రాంతం నుండి సెంట్రల్‌ గాజాకు వెళ్లిపోవాల్సిందిగా కూడా ఆదేశించింది. ఇప్పుడు అక్కడ కూడా వైమానిక దాడులను భీకరంగా జరుపుతోంది. గురువారం నాటి పరిస్థితి దారుణంగా వుండడంతో మళ్లీ అక్కడ నుండి వలస వెళ్లిపోవడానికి ప్రజలు సిద్ధపడుతున్నారు. సెంట్రల్‌ గాజాలో భీకరంగా దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్‌ మిలటరీ, సాయుధ వాహనాలు ఆ ప్రాంతంలోకి లోపలకంటా చొచ్చుకుపోతున్నాయి. శతఘ్నులు, వైమానిక దాడులతో పాటుగా, డ్రోణ్‌లతో కూడా దాడులు జరుగుతున్నాయి. రఫాలో నెలకొన్న మానవతా సంక్షోభం అంతర్జాతీయ సమాజం, భద్రతా మండలి, ఇతర అంతర్జాతీయ సంస్థల్లో మిగిలివున్న విశ్వసనీయతకు పరీక్ష అని పాలస్తీనా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. సెంట్రల్‌ గాజాతో గాజా నగరాన్ని అనుసంథానిస్తున్న వంతెనపై ఇజ్రాయిల్‌ బలగాలు బాంబు దాడులు జరిపి, ధ్వంసం చేశాయి. దాడికి గురవుతున్న ప్రాంతాల నుండి ఖాళీ చేయాల్సిందిగా ఒక పక్క ప్రజలను కోరుతున్నారు. మరోపక్క మానవతా కారిడార్‌లుగా ఉపయోగిస్తున్న ఆ రోడ్లపైనే దాడులు చేసి వారిని చంపేస్తున్నారు.

లెబనాన్‌-ఇజ్రాయిల్‌ సరిహద్దుల్లో ఘర్షణలు

లెబనాన్‌-ఇజ్రాయిల్‌ సరిహద్దు 120 కిలోమీటర్ల పొడవునా ఘర్షణలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వరుసగా వైమానిక దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయిల్‌, హిజ్బుల్లా మిలటరీ మౌలిక సదుపాయాలను, లాంచ్‌ సైట్‌లను ధ్వంసం చేయడమే తమ లక్ష్యమని చెబుతోంది. ఉత్తర ఇజ్రాయిల్‌లోని తమ ఇళ్లకు వెళ్లాలంటే వేలాదిమంది ఇజ్రాయిలీలకు ఇదొక్కటే మార్గం కావడంతో సరిహద్దు నుండి వైదొలగాల్సిందిగా హిజ్బుల్లా కార్యకర్తలను కోరుతోంది. గాజాపై ఇజ్రాయిల్‌ దాడులను ఆపితేనే సరిహద్దు వద్ద పరిస్థితుల గురించి తాము చర్చిస్తామని హిజ్బుల్లా తేల్చి చెబుతోంది.

అమ్మాన్‌లో భారీ ప్రదర్శనలు

పాలస్తీనియన్లకు మద్దతుగా జోర్డాన్‌ రాజధాని అమ్మాన్‌లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. శుక్రవారం ప్రార్ధనలు ముగిసిన వెంటనే ప్రదర్శన ప్రారంభమైంది. ఇజ్రాయిల్‌ తక్షణమే కాల్పుల విరమణ చేయాలని ప్రదర్శకులు నినదించారు.

➡️