బ్రిటన్‌లో 72 గంటల నివరధిక సమ్మె చేపట్టిన జూనియర్‌ వైద్యులు

Dec 20,2023 14:39 #junior doctors, #London, #strike

లండన్‌  :    మెరుగైన వేతనాలు కోరుతూ బ్రిటీష్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (బిఎంఎ)కి చెందిన జూనియర్‌ వైద్యులు 72 గంటల నిరవధిక సమ్మెను చేపట్టారు. మంగళవారం ఉదయం 7.00 గంటల నుండి సమ్మెను ప్రారంభించినట్లు జూనియర్‌ వైద్యులు తెలిపారు. తక్కువవేతనం, అధిక శ్రమ, ఒత్తిడికి గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్చలు ప్రారంభించాలని ఆరోగ్య కార్యదర్శిని కోరారు. తమ డిమాండ్‌లకు ప్రభుత్వం దిగిరాకపోతే జనవరి 3 నుండి ఆరు రోజుల సమ్మె చేపట్టనున్నట్లు జూనియర్‌ వైద్యులు హెచ్చరించారు. ఎన్‌హెచ్‌ఎస్‌ చరిత్రలో ఇది సుదీర్ఘమైన సమ్మె కానుంది.

నేషనల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) సిబ్బంది కొరతతో ప్రతి శీతాకాలం భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నామని బిఎంఎ కౌన్సిల్‌ చైర్మన్‌ ఫిలిప్‌ బెన్‌ఫీల్డ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగానే ఈ పరిస్థితులను ఎదుర్కొంటున్నామని అన్నారు. ఈ స్థాయిలో ప్రభుత్వం చర్చలు జరపకుండా వెనక్కి తగ్గడం అసంతృప్తికి గురిచేసిందని బిఎంఎ జూనియర్‌ వైద్యుల కమిటీ ఉపాధ్యక్షులు డా. రాబర్ట్‌ లారెన్సన్‌, డా. వివేక్‌ త్రివేదిలు పేర్కొన్నారు. సమ్మె షెడ్యూల్‌తో సంబంధం లేకుండా హెల్త్‌ సెక్రటరీ విక్టోరియా ఆట్కిన్స్‌ నాయకత్వ చొరవతో చర్చలకు ముందుకు రావాలని కోరారు.  ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా చర్చలను తిరిగి ప్రారంభించాలని మంత్రులు మరియు యూనియన్‌లను ఎన్‌హెచ్‌ఎస్‌ ప్రొవైడర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సర్‌ జూలియస్‌ హార్టీ పేర్కొన్నారు.

➡️