Maldives : కొనసాగుతున్న పార్లమెంటు ఎన్నికలు

మాలె :   మాల్దీవుల్లో నేడు  పార్లమెంటు ఎన్నికలు కొనసాగుతున్నాయి.  మాల్దీవుల పార్లమెంట్‌ (మజ్లీస్‌)లో ఐదేళ్ల కాలానికి 93 మంది సభ్యులను ఎన్నుకునేందుకు సుమారు 2.8 లక్షల మంది ప్రజలు తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.   అయితే ఈ ఎన్నికలు అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు కాదు..   గతేడాది అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మొయిజ్జు.. తన విధానాలను ముందుకు తీసుకువెళ్లేందుకు పార్లమెంట్‌ మద్దతు లభిస్తుందా లేదా  అనేది తేలనుంది.   మొయిజ్జు భారత వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారంటూ ప్రతిపక్షం ఆయనపై విరుచుకుపడుతోన్న సంగతి తెలిసిందే.

గతేడాది అత్యున్నత పదవికి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడు మొయిజ్జు అధికారంలోకి వచ్చారు. అయితే కూటమిలో భాగమైన ఆయన పార్టీ పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ 93 మందిసభ్యులు కలిగిన పార్లమెంటులో మైనారిటీగా ఉంది.అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్‌ సోలీహ్  నేతృత్వంలోని మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ పార్లమెంటులో 41 మంది సభ్యులతో మెజారిటీలో కొనసాగుతోంది.

ఈ ఎన్నికల్లో భౌగోళిక రాజకీయాలు చాలా కీలక పాత్ర పోషిస్తున్నాయని మొయిజ్జు సీనియర్‌ సహాయకులు ఒకరు మీడియాతో పేర్కొన్నారు. భారత సైన్యాన్ని వెనక్కి పంపుతానని హామీ ఇచ్చి మొయిజ్జు అధికారంలోకి వచ్చారని, ఆయన ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అయితే పార్లమెంట్‌ సభ్యులు ఆయనకు సహకరించడం లేదని అన్నారు.

మాల్దీవుల ప్రజల తీర్పు మిశ్రమంగా ఉండవచ్చని జర్నలిస్ట్‌ అహ్మద్‌ ఐద్‌ పేర్కొన్నారు. ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదని, గట్టి పోటీ ఉందని అన్నారు. బహుశా 50-50 ఉండే అవకాశం ఉందని అన్నారు. మొయిజ్జు పార్టీ పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లోనూ చీలికలు ఉండటంతో స్పష్టమైన మెజారిటీ పొందే అవకాశం లేదని అంచనావేశారు.

➡️