ఆస్పత్రి ఆవరణలో పలువురి ఉరితీత

  •  ఇజ్రాయిల్‌ సైన్యం ఘాతుకం

గాజా : బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని ధిక్కరిస్తూ ఇజ్రాయిల్‌ తన దాష్టీకాలను కొనసాగిస్తోంది. అల్‌ షిఫా అస్పత్రిలో తలదాచుకున్న పాలస్తీనా పౌరులను పలువుర్ని సైన్యం ఉరి తీసిందని పాలస్తీనా రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీ (పిఆర్‌సిఎస్‌) తెలిపింది. ఆస్పత్రిలోని అన్ని విభాగాలు మంటల్లో దగ్ధమయ్యాయని, ఉరితీయబడిన పౌరుల మృతదేహాలు ఆవరణలో చెల్లాచెదురుగా పడి వున్నాయని తెలిపింది. ‘పరిస్థితి చాలా దయనీయంగా వుంది. వైద్య సిబ్బందిలో కొంతమందిని చంపేశారు, మరికొంతమందిని వేధింపులకు గురి చేశారు. మరికొందరిని నిర్బంధంలోకి తీసుకున్నారు. వీరందరినీ గత రెండు వారాలుగా ఎలాంటి ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు, సరఫరాలు లేకుండా దిగ్బంధించారు.” అని రెడ్‌ క్రీసెంట్‌ సొసైటీ ప్రతినిధి రయీద్‌ అల్‌ నిమ్స్‌ మీడియాకు తెలిపారు. ఆస్పత్రిలో ప్రారంభమైన మంటలను అదుపుచేసేందుకు పౌరరక్షణ దళాలను లోపలకు అనుమతించలేదని చెప్పారు. ఈ మంటల వల్ల తీవ్ర నష్టం జరిగిందన్నారు. కచ్చితంగా ఎంతమంది మరణించారనే సమాచారం తక్షణమే అందుబాటులో లేనప్పటికీ మరణించిన వారి సంఖ్య ఎక్కువే వుంటుందని చెప్పారు.
అల్‌షిఫా ఆస్పత్రిలోని నేరాలపై దర్యాప్తు జరిపేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా హమాస్‌ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కోరింది. ఈ అరాచకానికి, నేరాలకు అమెరికా ప్రభుత్వం, అధ్యక్షుడు బైడెన్‌ వ్యక్తిగతంగా పూర్తి బాధ్యత వహించాలని హమాస్‌ కోరింది. పాలస్తీనియన్లను వారి మాతృభూమి నుండి పారద్రోలాలన్నదే శత్రువు ఆలోచన అని ఈ ఆటవిక దాడితో మరోసారి స్పష్టమైందని పేర్కొంది. ఆల్‌ షిఫా ఆస్పత్రి ఆవరణపై శత్రువు వ్యవహరించిన తీరును ఖండించాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని, ఐక్యరాజ్య సమితిని హమాస్‌ కోరింది. ఈ నేరాల దర్యాప్తుకు అనుసరించాల్సిన పద్దతులను, విధి విధానాలను తక్షణమే చేపట్టాల్సిందిగా అంతర్జాతీయ న్యాయ సంస్థలను ముఖ్యంగా ఐసిసిని కోరింది. ఆస్పత్రి ఆవరణలో వందలాదిగా మృతదేహాలు పడి వున్న విషయాన్ని పాలస్తీనా వార్తా సంస్థ వఫా కూడా తెలియచేసింది. ఆల్‌షిఫా ఆస్పత్రిలో రెండు వారాల పాటు కొనసాగించిన ఆపరేషన్‌లో పాలస్తీనా సాయుధులను కాల్చి చంపామని, ఆయుధాలను, నిఘా పత్రాలను స్వాధీనం చేసుకున్నామని ఇజ్రాయిల్‌ బలగాలు తెలిపాయి. సెంట్రల్‌ గాజాలోని అల్‌ అక్సా ఆస్పత్రి ఆవరణపై ఇజ్రాయిల్‌ బలగాలు జరిపిన వైమానిక దాడిలో నలుగురు పాలస్తీనియన్లు మరణించారని డబ్ల్యుహెచ్‌ఓ తెలిపింది.

➡️