మాస్కోలో భారీ ఉగ్రదాడి – 115 మంది మృతి

మాస్కో (రష్యా) : భారీ ఉగ్రదాడితో మాస్కో దద్దరిల్లిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది.

ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్‌ సంగీత కచేరి కార్యక్రమం నిన్న రాత్రి క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభం అవుతుందనగా, ఉగ్రవాదులు మిలటరీ దుస్తుల్లో మెషిన్‌గన్లతో బాంబులతో హాల్‌లోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 115 మంది మృతి చెందారు.  187 మంది గాయపడ్డారు.  వందమందికిపైగా గాయాపడ్డారు. పలువురు భయాందోళనలతో ఘటనాస్థలం నుంచి పారిపోతున్న దృశ్యాలు బయటికొచ్చాయి. మ్యూజిక్‌ కన్సర్ట్‌ ప్రాంగణమంతా మంటలు, పొగలతో కమ్ముకుంది. ఘటనా స్థలానికి అధికార సహాయక బృందాలు చేరుకున్నాయి. బాధితుల హాహాకారాలతో భీకర వాతావరణం నెలకొంది. క్షతగాత్రులను అధికారులు ఎయిర్‌లిఫ్ట్‌ చేశారు. సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హాల్‌లో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించారు. కాల్పుల తరువాత ఉగ్రవాదులు అక్కడి నుండి తప్పించుకున్నారు. వారికోసం ఆర్మీ గాలింపు చేపట్టింది. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

భారీ మూల్యం చెల్లించుకుంటారు : పుతిన్‌
మాస్కోలో జరిగిన ఉగ్రదాడిపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక ప్రకటన చేశారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా భారీ మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. రష్యాలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని రష్యాలోని అమెరికా ఎంబసీ వారం క్రితమే హెచ్చరించింది. గత రెండు దశాబ్దాల్లో రాష్యాలో ఇదే అతిపెద్ద ఉగ్రదాడిగా అధికారులు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ గెలుపొందారు.

మేమే చేశాం : ఐసిస్‌
మాస్కోలోని కాన్సర్ట్‌ హాల్‌ పై దాడి తామే చేశామని ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ శుక్రవారం వెల్లడించింది. దాడి చేసినవారు సురక్షితంగా తమ స్థావరాలకు వెళ్లిపోయారని స్పష్టం చేసింది. అయితే ఉగ్రవాదుల కోసం రష్యా ఆర్మీ జల్లెడపడుతోంది.

➡️