Nigeria : కిడ్నాప్‌ గురైన 300 మంది విద్యార్థుల విడుదల

Mar 24,2024 13:40 #central Nigeria, #school children

అబూజ :    రెండు వారాల క్రితం నైజీరియన్‌ పాఠశాల నుండి కిడ్నాప్‌కు గురైన సుమారు 300 మంది విద్యార్థులను ఆదివారం విడుదల చేశారు. వాయువ్య రాష్ట్రమైన కడునాలోని మారుమూల గ్రామంలోని ఓ పాఠశాల నుండి వారు కిడ్నాప్‌కు గురైనట్లు స్థానిక అధికారులు తెలిపారు.

కడునా రాష్ట్రం కురిగా పట్టణంలోని ఓ పాఠశాల నుంచి విద్యార్థులను ఈ నెల 7న సాయుధ వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అడ్డుకునేందుకు  యత్నించిన ఓ వ్యక్తిని కాల్చిచంపారు.  విద్యార్థుల్ని తమతోపాటు సమీప అడవుల్లోకి తీసుకు వెళ్లినట్లు సమాచారం. విద్యార్థుల్లో 12 ఏళ్లలోపు వారు సుమారు ఓ 100 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది.  వారిని విడుదల చేసేందుకు రూ.5 కోట్లు ఇవ్వాలని.. లేకుంటే విద్యార్థులను చంపేస్తామని బెదిరించినట్లు వార్తలు వెలువడ్డాయి. చివరకు వారిని సురక్షితంగా నేడు విడుదల చేయడం గమనార్హం.

ఈ ఘటనపై కడునా రాష్ట్ర గవర్నర్‌ ఉబా సని ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులను క్షేమంగా విడుదల చేసేందుకు యత్నించిన నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబుకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అయితే విద్యార్థుల వివరాలను వెల్లడించలేదు.

ఉత్తర నైజీరియాలో అధికంగా విద్యార్థుల కిడ్నాప్‌లు జరుగుతుంటాయి.  2014 నుండి బోర్నో రాష్ట్రంలోని చిబోక్‌ గ్రామంలో సాయుధ దుండగులు 200 మందికి పైగా విద్యార్థినులను కిడ్నాప్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ కిడ్నాప్‌లు దేశంలోని వాయువ్య, సెంట్రల్‌ ప్రాంతాలకు కూడా పాకాయి.  సాయుధ దుండుగులు నగదు కోసం గ్రామస్థులను, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

➡️