వ్యవసాయ విధానాలపై స్పెయిన్‌లో భగ్గుమన్న రైతాంగం

Feb 10,2024 10:30 #agricultural policies, #spain
  • నాల్గవ రోజు ట్రాక్టర్లతో రోడ్ల దిగ్బంధనం

మాడ్రిడ్‌: యూరోపియన్‌ యూనియన్‌ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా, తీవ్ర కరువు బారిన పడిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని కోరుతూ స్పెయిన్‌లో రైతులు ఉద్యమించారు. వీరి ఆందోళన శుక్రవారం నాలుగో రోజుకు చేరుకుంది. వేలాది మంది రైతులు ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించారు. ఇంకొందరు కాలి నడకన ప్రధాన నగర కేంద్రాలకు చేరుకుని తమ నిరసన తెలియజేస్తున్నారు. బార్సిలోనా, జరాగోజా, కెటాలినా తదితర ప్రాంతాల్లో వేలాది ట్రాక్టర్లతో రైతులు జాతీయ రహదారులపై అడ్డంగా నిలిపి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. విపరీతంగా పెరిగిపోయిన వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులను తగ్గించాలని, పర్యావరణ అనుకూల విధానాలపేరుతో పురుగు మందులు, ఇతర రసాయనిక ఎరువుల వాడకంపై పెట్టిన ఆంక్షలు సడలించాలని, తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న రైతాంగానికి పరిహారం చెల్లించాలని వారు గత కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో రైతు సంఘాలు ఈ నిరసనలకు పిలుపునిచ్చాయి. వచ్చే వారం కూడా ఈ నిరసనలు కొనసాగనున్నాయి. ఈ నెల21న దేశ రాజధాని మాడ్రిడ్‌లో మహా ర్యాలీ నిర్వహణకు రైతులు సన్నద్ధమవుతున్నారు.ఈ ఆందోళనల నేపథ్యంలో స్పెయిన్‌ ప్రధాని పెడ్రో శాంఛెజ్‌ గురువారం పార్లమెంటులో మాట్లాడుతూ, రైతులను ఆదుకుంటామని, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను యూరోపియన్‌ యూనియన్‌ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. లక్షా 40వేల మంది రైతులకు కరువు పరిహారంగా 27 కోట్ల యూరోలను విడుదలజేస్తున్నట్లు వ్యవసాయ మంత్రి ప్రకటించారు. ఇదే తరహా ఆందోళనలు గ్రీస్‌, ఫ్రాన్స్‌, పోలండ్‌ వంటి ఇతర యూరపు దేశాల్లో ఇటీవల తలెత్తిన సంగతి తెలిసిందే.

➡️