ముంబయిలో దిగనున్న లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం..

పారిస్‌/ముంబయి :    సుమారు 300 మందికి పైగా భారతీయులతో ఫ్రాన్స్‌లో బయలుదేరిన లెజెండ్‌ ఎయిర్‌లెన్స్‌ విమానం సోమవారం ముంబయిలో ల్యాండ్‌ కానున్నట్లు అధికారులు తెలిపారు. మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న అనుమానంతో ఈ విమానాన్ని గత గురువారం ఫ్రెంచ్‌ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

వివరాల ప్రకారం.. రొమానియన్‌ కంపెనీ లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్వహిస్తున్న ఏ340 విమానం 303 మంది భారతీయ ప్రయాణికులతో గురువారం దుబారు నుంచి నికరాగువాకు బయలుదేరింది. ఈ క్రమంలో ప్యారిస్‌కు తూర్పున 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో ఇంధనం నింపుకునేందుకు విమానం ల్యాండ్‌ అయ్యింది.

అయితే, ‘మానవ అక్రమ రవాణా’ జరుగుతోందన్న గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అందిన సమాచారంతో విమానాన్ని ఫ్రాన్స్‌ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు.  ఈ క్రమంలో విమానంలోని ప్రయాణికులను రెండు రోజుల పాటు ఎయిర్‌పోర్టులోనే అధికారులు ప్రశ్నించారు. వీరిలో కొందరు హిందీలో మాట్లాడగా, మరికొందరు తమిళంలో మాట్లాడినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విచారణ అనంతరం ఆదివారం విమాన ప్రయాణానికి పూర్తి అనుమతులు జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రయాణికుల్లో 11 మంది చిన్నారులు ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లు తెలిపారు.

➡️