పీనల్‌ కోడ్‌లో మార్పులపై స్లొవేకియాలో పెల్లుబికిన ప్రజాగ్రహం

Jan 20,2024 10:56 #penal code, #Slovakia over changes

బ్రటిస్లోవా: దేశ శిక్షాస్మతిలో సమూల మార్పులు చేస్తూ రాబర్ట్‌ ఫికో నేతృత్వంలోని మితవాద ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా స్లొవేకియాలో ప్రజాగ్రహం కట్టలుతెంచుకుంది. ఈ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని వేలాదిమంది గురువారం రాజధాని వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ప్రధానమంత్రి రాబర్ట్‌ ఫికో నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిపాదిత మార్పులను అధ్యక్షురాలు జుజానా కాపుటోవా కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లులోని అంశాలు చట్టబద్ధ పాలనను ప్రమాదంలో పడవేయడమే కాదు, సమాజానికి చెప్పలేనంత కీడు కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. వ్యవస్థీకత నేరాలు , తీవ్రవాదం వంటి వాటిని డీల్‌ చేసే ప్రత్యేక ప్రాసిక్యూటర్ల కార్యాలయాన్ని రద్దు చేసింది. ఇకపై ఈ నేరాలను ప్రాంతీయ కార్యాలయాల్లోని ప్రాసిక్యూటర్లు చేపడతారని తెలిపింది. దాదాపు 20ఏళ్ళుగా ఈ ప్రాంతీయ కార్యాలయాలు ఇటువంటి కేసులను విచారించడం లేదు. తాము తీసుకునే చర్యలను ఆమోదించేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ పార్లమెంటరీ పద్దతిని ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా 24 ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్యం కోసం జరుపుతున్న ఈ పోరాటాన్ని ఈనాడు యావత్‌ యూరప్‌ చూస్తోందని ప్రగతిశీల స్లొవేకియా నేత మైఖేల్‌ సిమెకా వ్యాఖ్యానించారు.

➡️