ఉక్రెయిన్‌ సరిహద్దు సమీపంలో కూలిన రష్యా విమానం

Jan 24,2024 16:09 #flight crash, #russia
  • 65 మంది ఖైదీలతో సహా 74 మంది మృతి

మాస్కో : పలువురు ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలను తీసుకుని వెళ్తున్న రష్యన్‌ భారీ సైనిక రవాణా విమానం ఐఎల్‌-76 బుధవారం ఉక్రెయిన్‌ సరిహద్దు సమీపంలోని బెల్గొరాడ్‌ ప్రాంతంలో కూలిపోయింది. దీంతో అందులో ఉన్న 65మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు చనిపోయారు. పరస్పర ఖైడీల మార్పిడి కింద వీరిని ఉక్రెయిన్‌కు అప్పగించేందుకు తీసుకెళ్తుండగా ఈ దారుణం చోటు చేసుకున్నట్లు ఆ ప్రాంత గవర్నర్‌ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు విమానం కూలిన ప్రాంతానికి ప్రత్యేక మిలటరీ కమిషన్‌ వెళుతోందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. యుద్ధ ఖైదీలతో పాటూ మరో ముగ్గురు వ్యక్తులు, ఆరుగురు సిబ్బంది కూడా విమానంలో వున్నారని తెలిపింది.. మంచుతో కప్పబడిన గ్రామీణ ప్రాంతంలో ఆకాశం నుండి విమానం పడిపోతుండడం, నేలను తాకగానే పెద్ద అగ్ని గోళంలా మండుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.. ఉక్రెయిన్‌ బలగాలు ప్రయోగించిన క్షిపణుల వల్లనే ఈ విమానం కూలిపోయిందని రష్యా పార్లమెంట్‌కి చెందిన ఇద్దరు సీనియర్‌ సభ్యులు ఆరోపించారు. యుద్ధ ఖైదీలకు సంబంధించిన ఉక్రెయిన్‌ కో ఆర్డినేషన్‌ హెడ్‌క్వార్టర్స్‌్‌ దీనిపై స్పందిస్తూ, విమానం కూలిపోయినట్లు కనిపిస్తోందని పేర్కొంది. అంతకుమించి ఎలాంటి సమాచారాన్ని ఇవ్వలేదు. నిర్ధారించబడని సమా చారం పంచుకోరాదంటూ హెచ్చరించింది. రష్యన్‌ ఎంపి ఆండ్రీ కార్తాపొలొవ్‌ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ ఖైదీలను రెండు విమానాలు తీసుకెళుతున్నాయని, 80మంది ఖైదీలు వున్న రెండో ఐఎల్‌-76 విమానాన్ని ప్రమాద ప్రాంతం నుండి మాస్కో అత్యవసరంగా మళ్లించాల్సి వచ్చిందని తెలిపారు.

➡️