వియత్నాం కొత్త అధ్యక్షుడిగా తో లామ్‌

May 22,2024 23:56 #new president, #Vietnam

హనోయి : వియత్నాం సోషలిస్టు రిపబ్లిక్‌ కొత్త అధ్యక్షుడిగా వియత్నాం కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు తో లామ్‌ బుధవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వియత్నాం శతాబ్ది లక్ష్యాలని సాధించేందుకు శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని, రాజ్యాంగం ద్వారా దఖలుపడిన అధికారాలను వియత్నాం ప్రజల అభ్యున్నతి కోసం వినియోగిస్తానని చెప్పారు. .అంతకుముందు వియత్నాం నేషనల్‌ అసెంబ్లీ (పార్ల మెంటు) 67 ఏళ్ల తో లామ్‌ను కొత్త అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. మొత్తం 473 మంది డీప్యూటీలు (ప్రతినిధులు)కుగాను 472 మంది హాజరైన ఈ సమావేశంలో దేశాధ్యక్ష పదవికి లామ్‌ పేరును ప్రతిపాదిస్తూ పార్లమెంటు సెక్రటరీ జనరల్‌ బుయివాన్‌ కువాంగ్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ ఏడాది మార్చిలో వో వాన్‌ తాంగ్‌ రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. లామ్‌ 2026 వరకు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. ప్రతి అయిదేళ్లకొకసారి జరిగే వియత్నాం కమ్యూనిస్టు పార్టీ మహాసభ 2021లో ఎన్‌గుయెన్‌ ఫూ త్రాంగ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నుకుంది. లామ్‌ నాలుగు దశాబ్దాల పాటు ప్రజా భద్రతా వ్యవహారాల ఉప మంత్రిగా పనిచేశారు. రెండు పర్యాయాలు పార్టీ పొలిట్‌బ్యూరోకు ఎన్నికయ్యారు. 2016లో మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం వియత్నాం పోలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎదిగారు.

➡️