ఫిలిప్సైన్స్‌లో చైనా వ్యాక్సిన్లపై అమెరికా తప్పుడు ప్రచారం

Jun 20,2024 23:25 #China, #vaccination
  • రాయిటర్స్‌ దర్యాప్తులో వెల్లడి

బీజింగ్‌ : ఫిలిప్పైన్స్‌లో చైనా వ్యాక్సిన్లను అప్రతిష్టపాల్జేసేందుకు అమెరికా మిలటరీ రహస్యంగా తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించిందని ఇటీవల రాయిటర్స్‌ దర్యాప్తులో వెల్లడైంది. ఈ చర్యను ప్రజారోగ్య నిపుణులు తీవ్రంగా ఖండించారు. అమెరికా మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారులు కూడా దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా తన గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రయత్నిస్తోందని, చైనా అభివృద్ధిని తప్పుడు కథనాలు, వర్ణనలతో దెబ్బతీసేందుకు చూస్తోందని, ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేస్తోందని, అంతులేని రీతిలో అసత్యాలు వ్యాప్తి చేస్తోందని పలువురు నిపుణులు విమర్శిస్తున్నారు. చైనా వ్యాక్సిన్లను అప్రతిష్టపాల్జేసే ప్రచారానికి ఎలాంటి శాస్త్రీయ సాక్ష్యాధారాలు లేవని, కేవలం భౌగోళిక, రాజకీయ లక్ష్యాలు, వ్యూహాత్మక ప్రయోజనాలే వున్నాయని విమర్శించారు.
కోవిడ్‌తో దారుణంగా దెబ్బతిన్న ఫిలిప్సైన్స్‌కు సాయమందించడానికి బీజింగ్‌ చేసిన యత్నాలను వాషింగ్టన్‌ కోవర్టు ఆపరేషన్‌ దెబ్బతీస్తోందని మనీలాకు చెందిన మేథో సంస్థ ఆసియన్‌ సెంచరీ ఫిలిప్సైన్స్‌ వ్యూహాత్మక అధ్యయనాల సంస్థ ఉపాధ్యక్షుడు అన్నా మలిండాగ్‌ విమర్శించారు. ఈ చర్యలు గణనీయమైన రీతిలో నైతిక, వ్యూహాత్మక ఆందోళనలు, ప్రశ్నలను లేవదీస్తున్నాయన్నారు. శాస్త్రీయ సాక్ష్యాధారాలతో మాట్లాడేందుకు బదులుగా భౌగోళిక, రాజకీయ లక్ష్యాల ఆధారంగా తప్పుడు ప్రచారాన్ని చేపట్టడం వల్ల కరోనా మహమ్మారిని సమిష్టిగా ఎదుర్కొనాల్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగలుతుందని అన్నారు.
నిజానికి, ఇలాంటి నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతూ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం అమెరికాకు ఇదే మొదటిసారి కాదు, 2019లో చైనా సోషల్‌ మీడియాను లక్ష్యంగా చేసుకుని ఆనాటి ట్రంప్‌ ప్రభుత్వం రహస్య ప్రచారాన్ని ప్రారంభించింది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాలంటూ ప్రచారం చేసింది.

➡️