అయోధ్యలో కార్యక్రమానికి ఏచూరి దూరం

Dec 27,2023 08:54 #cpm politburo, #prakatana

-మత వేడుకను ప్రభుత్వ కార్యక్రమంగా మార్చేస్తున్నారు

-సిపిఐ (ఎం) పొలిట్‌బ్యూరో

న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరుకావడం లేదని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. మత విశ్వాసాలను గౌరవించడం, ప్రతి వ్యక్తి తమ విశ్వాసానికి అనుగుణంగా నడుచుకునే హక్కును కాపాడడం సిపిఐ(ఎం) విధానం. మతాన్ని రాజకీయ లబ్ధి కోసం సాధనంగా మార్చకూడదు. అది వ్యక్తిగత ఎంపిక అని సిపిఐ(ఎం) నమ్ముతుంది. అందుకే, ఆ ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ, ఏచూరి ఈ కార్యక్రమంలో పాల్గనబోవడం లేదని పొలిట్‌బ్యూరో తెలిపింది. ప్రధాన మంత్రి, యుపి ముఖ్యమంత్రి, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రత్యక్ష భాగస్వామ్యంతో మత పరమైన వేడుకను ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంగా బిజెపి, ఆరెస్సెస్‌లు మార్చడం అత్యంత దురదృష్టకరమని పొలిట్‌బ్యూరో వ్యాఖ్యానించింది. ‘రాజ్యాంగం ప్రకారం పాలనా నిర్వహణ వ్యవహారాల్లో మతప్రమేయం ఉండకూడదని సుప్రీం కోర్టు ఇదివరకే ఉద్ఘాటించింది. భారత దేశంలో ప్రభుత్వ పాలనకు సంబంధించిన మౌలిక సూత్రమిది. ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రభుత్వం ఈ సూత్రాన్ని ఉల్లంఘించింది’ అని సిపిఐ (ఎం) పొలిట్‌బ్యూరో విమర్శించింది.

➡️