కేంద్రంలో మార్పు ఖాయం

Mar 24,2024 00:20 #Dindigal' Sabha, #Forum Leaders

– ‘ఇండియా’ విజయభేరి తథ్యం
– ‘దిండిగల్‌’ సభలో ఫోరం నేతలు
చెన్నయ్ : ప్రజాస్వామ్య విలువలను మంటగలిపి అత్యంత నిరంకుశంగా పాలన సాగిస్తున్న కేంద్రంలోని అధికార బిజెపి ఈ ఎన్నికల్లో మట్టికరవడం ఖాయమని, ‘ఇండియా’ ఫోరం పార్టీలు విజయభేరి మోగించడం తథ్యమని పలువురు నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. తమిళనాడులోని దిండిగల్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న సిపిఎం అభ్యర్థి ఆర్‌ సచ్చిదానందన్‌కు మద్దతుగా ‘ఇండియా’ ఫోరం శనివారం భారీ ర్యాలీ నిర్వహించింది. ఒట్టెంఛత్రంలో నిర్వహించిన ఈ ఎన్నికల ప్రచార సభలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి షణ్ముగం, రాష్ట్ర మంత్రులు ఐ పెరియస్వామి, ఎ చక్రపాణి తదితరులు పాల్గన్నారు. కేంద్రంలో ప్రభుత్వ మార్పు ఖాయమని, ‘ఇండియా’ ఫోరం అధికారంలోకి రాగానే ఉపాధి పథకం కింద పనిదినాలను ఏడాదికి 150 రోజులకు పెంచుతామని పెరియస్వామి తెలిపారు. రాష్ట్ర రవాణా సంస్థ నష్టాల్లో ఉన్నా కూడా ఇక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్‌ నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోందని తెలిపారు. మరో మంత్రి ఎ చక్రపాణి మాట్లాడుతూ..స్టాలిన్‌ ప్రభుత్వం అమల్జేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సిఎఎ వంటి వినాశకర చర్యలతో ప్రజల మధ్య చిచ్చు రాజేస్తున్న మోడీ సర్కార్‌ను గద్దె దింపి ప్రజాతంత్ర శక్తులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె కనగరాజ్‌, మతుకుర్‌ రామలింగం, కె బాలభారతి, ఎన్‌ పాండి తదితరులు పాల్గొన్నారు.

➡️