కేంద్రం వివక్షపై పోరు- జనవరిలో ఢిల్లీలో ఆందోళన

Nov 18,2023 08:51 #kerala, #Pinarayi Vijayan

 

హాజరుకానున్న కేరళ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు
రూ.58,000 కోట్లు బకాయిలు వెంటనే విడుదలజేయాలని డిమాండ్‌
ఆందోళన ఉధృతికి ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు
ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌ ఇపి జయరాజన్‌ వెల్లడి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షపై కేరళ ప్రభుత్వం పోరుకు సిద్ధమవుతోంది. కేరళతోపాటు బిజెపియేతర రాష్ట్రాల పట్ల మోడీ సర్కార్‌ అవలంబిస్తున్న కక్షసాధింపు ధోరణిని నిరసిస్తూ జనవరిలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో ఢిల్లీలో పెద్దయెత్తున ఆందోళన నిర్వహించాలని ఎల్‌డిఎఫ్‌ నిర్ణయించింది. కేరళమాదిరే వివక్షకు గురవుతున్న ఇతర రాష్ట్రాలను కూడా కలుపుకుని ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు ఎల్‌డిఎఫ్‌ కన్వీనర్‌ ఇపి జయరాజన్‌ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వచ్చే నెలలో రాష్ట్రవ్యాపితంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టాలని శుక్రవారం తిరువనంతపురంలో జరిగిన వామపక్ష ప్రజాతంత్ర కూటమి నిర్ణయించిందన్నారు. ఎల్‌డిఎఫ్‌ సమావేశ నిర్ణయాలను ఆయన విలేకరులకు వెల్లడించారు. ఈ విషయమై బిజెపియేతర రాష్ట్రాలను కూడా కలుపుకుపోతామని, ఇందుకు సంబంధించి కేరళ ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ ఆయా రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతారని చెప్పారు. రూ. 58,000 కోట్లు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఉన్నాయని, కేంద్రంపై ఐక్యంగా పోరాడేందుకు ముందుకు రావాలని రాష్ట్రంలోని అన్ని పార్టీలను ముఖ్యమంత్రి కోరారని, అయినా కాంగ్రెస్‌ ముందుకురావడం లేదన్నారు. పిటిషన్‌పై సంతకం చేసేందుకు కూడా వారు ఇష్టపడలేదని తెలిపారు. భూసేకరణ చట్టం బిల్లుపై గవర్నరు సంతకం పెట్టకుండా తొక్కిపట్టడాన్ని నిరసిస్తూ రైతులు రాజ్‌భవన్‌ మార్చ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యారంగంలో కేంద్రం అనుసరిస్తున్న తిరోగమన విధానాలపైనా పోరాడతామని చెప్పారు.

➡️