జ్ఞానవాపి మసీదు కేసు : మసీదు కమిటీ పిటిషన్‌లను తిరస్కరించిన అలహాబాద్‌ హైకోర్టు

 అలహాబాద్‌ :    జ్ఞానవాపి కేసులో మసీదు కమిటీ దాఖలు చేసిన అన్ని పిటిషన్‌లను అలహాబాద్‌ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఈ కేసుపై విచారణను ఆరు నెలల్లోగా ముగించాలని వారణాసి కోర్టుని ఆదేశించింది. ఈ కేసు దేశంలోని రెండు ప్రధాన కమ్యూనిటీలను ప్రభావితం చేస్తుందని, ఆరు నెలల్లోగా తీర్పు ఇవ్వాలని జస్టిస్‌ రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ట్రయల్‌ కోర్టుకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్‌ వ్యాజ్యాన్ని సవాలు చేస్తూ దాఖలైన ఐదు పిటిషన్లపై డిసెంబర్‌ 8న వాదనలు విన్న జస్టిస్‌ అగర్వాల్‌ తీర్పును రిజర్వ్‌ చేశారు. జ్ఞానవాపి మసీదుపై శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఏప్రిల్‌ 8 2021లో వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ అంజుమన్‌ ఇంతిజామియా మస్జీద్‌ కమిటీ (ఎఐఎంసి), ఉత్తరప్రదేశ్‌ సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డులు పిటిషన్‌లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని ఆనుకుని ఉన్న జ్ఞానవాపి మసీదు నిర్వహణను ఎఐఎంసి చూస్తోంది. అయితే జ్ఞానవాపి మసీదు ఆలయంలో భాగమని, ఆ స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని హిందూ పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ప్రార్థనా స్థలాల చట్టం 1991 (ప్రత్యేక నిబంధనలు) ప్రకారం.. 1947 ఆగస్ట్‌ 15న ఉనికిలో ఉన్న మతపరమైన ప్రదేశాలను మార్చకూడదని ఎఐఎంసి, యుపి సున్ని సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డ్‌లు వాదిస్తున్నాయి.

➡️