జ్ఞానవాపి మసీదు నివేదిక వెల్లడిపై జనవరి 24న నిర్ణయం

 వారణాసి :  జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) నిర్వహించిన సర్వే నివేదికను బహిర్గతం చేయాలా వద్దా అన్న విషయాన్ని ఈ నెల 24న వారణాసి జిల్లా కోర్టు నిర్ణయించనుందని హిందువుల తరపు న్యాయవాది తెలిపారు. శనివారం జరిగిన విచారణలో   న్యాయమూర్తి ఎ.కె.విశ్వేష్‌  ఈ మేరకు  ఉత్తర్వులు జారీ చేశారని  హిందువుల తరఫు న్యాయవాది మదన్‌ మోహన్‌ యాదవ్‌ పేర్కొన్నారు.  కోర్టు ఆదేశాల మేరకు గతేడాది జులై 21న మసీదు ప్రాంగణంలో ఏఎస్‌ఐ శాస్త్రీయ సర్వే నిర్వహించి సీల్డు కవర్‌లో నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే.

ఈ నివేదికను కనీసం నాలుగు వారాలపాటు బహిర్గతం చేయొద్దంటూ బుధవారం ఏఎస్‌ఐ జిల్లా న్యాయస్థానాన్ని కోరింది. అవసరమైతే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు మరోసారి సర్వేకు ఆదేశించవచ్చంటూ అలహాబాద్‌ హైకోర్టు డిసెంబరు 19న ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో  ఈ నివేదిక బహిర్గతం చేయరాదని ఏఎస్‌ఐ  వాదించింది.   ఈ కేసు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో ఈ నెల 19న విచారణకు రానున్న నేపథ్యంలో ఆ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని జిల్లా న్యాయమూర్తి   పేర్కొన్నారు.

➡️