న్యాయ పోరాటం కొనసాగిస్తా – వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డి

Mar 2,2024 08:01 #press meet, #ys sunitha

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:’నాది న్యాయ పోరాటం. అది కొనసాగుతుంది’ అని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా నర్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నాడిక్కడ కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సునీతా నర్రెడ్డి మాట్లాడారు. తన సోదరుడు వైఎస్‌ జగన్‌కు, వైసిపికి ఓటు వేయొద్దని కోరారు. తన అనుకునే వాళ్లకు కాకుండా అందరికీ సహాయం చేసే వాళ్ళకు మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తాను ఎక్కడికి వెళ్లినా వివేకా హత్య కేసు గురించి అడుగుతున్నారని, ఈ కేసులో పోరాటంలో అండగా నిలిచిన టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, ఎంపి రఘురామ కృష్ణరాజుకు ధన్యవాదాలు అని అన్నారు.’మీడియా ముందుకు రావటానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. వివేకా కేసు విచారణలో మీ అందరి సహకారం కావాలి. రాష్ట్ర ప్రజల మద్దతు, తీర్పు నాకు అవసరం. సాధారణంగా హత్య కేసు 4, 5 రోజుల్లో తేలుతుంది. వివేకా హత్య కేసు దర్యాప్తు మాత్రం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. మా నాన్న హత్య కేసులో భాస్కర్‌ రెడ్డి, అవినాష్‌ రెడ్డి ప్రమేయం ఉంది. వారిద్దరినీ జగన్‌ రక్షిస్తున్నారు. తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. షర్మిల ఒక్కరే నాకు మొదటి నుంచి అండగా నిలిచారు. దస్తగిరి తనను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారని చెపుతున్నారు. దీన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి. సిబిఐ మీద తీవ్రమైన ప్రభావం ఉంది. జాతీయ మీడియాపై కూడా ఎంత ప్రభావం ఉందో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపి విజయసాయి రెడ్డిని సిబిఐ ఎందుకు విచారణ చేయడం లేదు?’ అని సునీత ప్రశ్నించారు.

➡️