పూణే వర్సిటీలో ‘రామ్‌లీలా’ వివాదం

నాటక బృందంపై ఎబివిపి గూండాల దాడి

విద్యార్థులనే అరెస్టు చేసిన పోలీసులు

ఖండించిన ప్రొఫెసర్ల సంఘం

పూణే : సావిత్రీబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం (ఎస్‌పిపియు)లో ‘రామ్‌లీలా’ నాటక బృందంపై ‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఎబివిపి) గూండాలు దాడి చేశారు. పైగా తమపైనే దాడి జరిగిందని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై ఏ మాత్రం విచారణ చేయకుండానే పోలీసులు వారు చెప్పినట్లే నడుచుకున్నారు. ఒక ప్రొఫెసర్‌, ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. వీరికి పూణే కోర్టు బెయిల్‌ మంజూరు చేయడం కొంత ఊరట కలిగించింది. అక్రమ అరెస్టులను యూనివర్శిటీ ప్రొఫెసర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. విద్యార్థులు, ప్రొఫెసర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎస్‌పిపియులో శుక్రవారం సాయంత్రం ‘జెబ్‌ విరు మెట్‌’ పేరుతో లలిత కళా కేంద్రం (సెంటర్‌ ఫర్‌ పెర్ఫార్మింగ్‌) ఒక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొంత మంది విద్యార్థులు ‘రామ్‌లీలా’ అనే ఒక నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకంతో తమ మతపరమైన మనోభావాలు దెబ్బతీస్తున్నారంటూ ఎబివిపి గూండాలు నాటక బృందంతో ఘర్షణకు దిగారు. భౌతిక దాడులకు పాల్పడ్డారు. దీంతో నాటకం నిలిపివేశారు. నాటక బృందంపై దాడికి పాల్పడ్డ ఎబివిపి గూండాలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఒక ప్రొఫెసర్‌, ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారకుండా యూనివర్శిటీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం పూణే కోర్టు వీరికి బెయిల్‌ మంజారు చేసింది. ఈ అక్రమ అరెస్టులను ఫ్రొఫెసర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ వివాదంపై ఎస్‌పిపియు యాజమాన్యం స్పందించింది. ఈ ఘటనపై విచారణ కోసం రిటైర్డ్‌ జిల్లా జడ్జి అధ్యక్షతన నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని విశ్వవిద్యాలయం ప్రకటించింది.

➡️