ప్రజా ఉద్యమాలు విస్తృతమవ్వాలి 

sitaram yechury on lenin 100th death anniversary seminar
  • లెనిన్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలి 
  • లెనిన్‌ శత వర్థంతి సభలో సీతారాం ఏచూరి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా మితవాద శక్తుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో విస్తృతమైన ప్రజా ఉద్యమాలు రావాల్సిన అవసరముందని సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నొక్కి చెప్పారు. మితవాదశక్తులతో ఏర్పడుతున్న ప్రభుత్వాలు ప్రపంచ కార్పొరేట్‌ శక్తులకు అనుగుణంగా పాలన చేస్తున్నాయని వివరించారు. మంచి పుస్తకం, రెడ్‌బుక్‌ డే సంయుక్త ఆధ్వర్యంలో లెనిన్‌ శత వర్థంతి సభను ఆన్‌లైన్‌ వేదికగా నాగార్జున యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వి అంజిరెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ప్రపంచంలో మార్పు రావాలని కారల్‌మార్క్స్‌ కోరుకుంటే.. లెనిన్‌ ఆచరణలో రష్యా విప్లవం ద్వారా చూపించారని కొనియాడారు. విప్లవ పోరాటాన్ని సరైన మార్గంలో తీసుకుపోవడంలో లెనిన్‌ విజయవంతమయ్యారన్నారు. లెనిన్‌ తన జీవితకాలంలో విస్తృత అధ్యయనం ద్వారా రచనలు చేశారనీ, అవన్నీ విప్లవోద్యమ నిర్దేశిత అవసరాలు తీర్చడానికే తప్ప పాండిత్య ప్రదర్శన కోసం చేయలేదని చెప్పారు. ఉద్యమాన్ని, పార్టీ నిర్మాణాన్ని వేరు చేసి చూడకూడదన్నారు. ఉద్యమ లక్ష్యానికి అనుగుణంగా నిర్మాణం, నిర్మాణ సామర్ధ్యానికి లోబడి ఉద్యమ పురోగతి ఉంటుందని వివరించారు. ఆయన రచనలను పరిశీలిస్తే రష్యా విప్లవ గమనంలోని ఒక్కో ఘట్టం ముగింపు, ప్రారంభం కనిపిస్తాయని గుర్తుచేశారు. లెనిన్‌ రచనలను అధ్యయనం చేసేటప్పుడు వాటి ఆవశ్యకత, చారిత్రక పరిస్థితులు, ఉద్యమ అవసరాలు, తదితరాలను గమనంలో పెట్టుకుని చదవాలని సూచించారు. మార్క్సిస్టు రచయిత, విశ్లేషకులు పాల్‌ లీ బ్లాంక్‌ మాట్లాడుతూ.. లెనిన్‌ విప్లవోద్యమం పట్ల ఎంత అకుంఠిత దీక్షను కలిగి ఉన్నాడో విప్లవ శ్రేణుల పట్ల కూడా అంతే ఆదరాభిమానాలను కలిగి ఉన్నాడని కొనియాడారు. విప్లవోద్యమ పురోగమనంలో సహచరులతో లెనిన్‌కు నెలకొన్న భినాభిప్రాయాలు రాజకీయపరమైనవే తప్ప వ్యక్తిగతం కాదని ఆయన జీవితాన్ని అధ్యయనం చేస్తే తెలుస్తుందన్నారు. విప్లవోద్యమాన్ని నిర్మించే క్రమంలో ఏ సానుకూల అంశం, పద్ధతి, ముందుకొచ్చినా దాన్ని స్వీకరించేంత విశాల మనసు కలిగిన విప్లవ నేత లెనిన్‌ అని కొనియాడారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మితవాదులు ఫాపిస్టు ధోరణులున్న శక్తులు పేట్రేగుతున్న తరుణంలో లెనినిస్టు ఆచరణ విప్లవోద్యమాలకు, ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమాలకు కరదీపికగా ఉంటుందని నొక్కి చెప్పారు. లెఫ్ట్‌వర్డ్‌ సంపాదకులు విజయప్రసాద్‌ మాట్లాడుతూ.. సమకాలీన ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి మార్క్సిస్టు అధ్యయనం ఎంత అవసరమో దాన్ని మార్చడానికి లెనినిజం అంతే అవసరమన్నారు. దేశీయంగానూ, విదేశాల్లోనూ కమ్యూనిస్టు పార్టీలు విప్లవమే అంతిమ లక్ష్యంగా.. సమకాలీన ఆర్థిక, సామాజిక, అంతరాలను, వివక్షను ప్రతిఘటించేందుకు సామాజిక న్యాయాన్ని సాధించేందుకు పనిచేయడమే లెనిన్‌కు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.

➡️