యుపిలో బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు

Feb 26,2024 08:17

– ఏడుగురు మృతి – మరో ఏడుగురికి తీవ్ర గాయాలు

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. వీరిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఫ్యాక్టరీలో పెద్ద మొత్తంలో రసాయన నిల్వలు ఉండటంతో పేలుడు తీవ్రతకు పరిసర గ్రామాలన్ని ఉలిక్కిపడ్డాయి. చనిపోయినవారిలో కొందరి శరీర భాగాలు కిలోమీటర్ల అవతల వరకు ఎగిరిపడ్డాయి. పరిసర ప్రాంతాలను దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో ఫ్యాక్టరీకి దగ్గర్లోని గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సంభవించినట్లు జిల్లా ఎస్‌పి బ్రిజేష్‌ కుమార్‌ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఫ్యాక్టరీలో పెద్ద మొత్తంలో నిల్వ ఉంచిన రసాయనాలే పేలుడుకు కారణమని అంచనా వేసినట్లు తెలిపారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో చాలా మంది పని చేస్తున్నట్లు ప్రయాగరాజ్‌ జోన్‌ అదనపు డిజిపి భాను భాస్కర్‌ తెలిపారు. సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమించి కొందరిని బయటకు తీసుకొచ్చారని, అప్పటికే ఏడుగురు చనిపోయారని ఆయన పేర్కొన్నారు. మృతులను షాహిద్‌ అలీ (35), కౌసర్‌ అలీ, శివనారాయణ్‌; రాంభువన్‌, శివకాంత్‌, అశోక్‌ కుమార్‌, జయచంద్రగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.

➡️