రెండవసారి పాక్‌ ప్రధానిగా షహబాజ్‌- నేడు ప్రమాణస్వీకారం

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ 24వ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ ఆదివారం ఎన్నికయ్యారు. సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌ నావను మిత్ర పక్షాల సహాయంతో ఒడ్డుకు చేరుస్తానని పాక్‌ ప్రధానిగా ఎన్నికైన వెంటనే చేసిన ప్రసంగంలో షెహబాజ్‌ పేర్కొన్నారు. పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి), పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ -నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌) పార్టీల సంకీర్ణ ప్రభుత్వానికి రెండో పర్యాయం ఆయన నేతృత్వం వహించనున్నారు. పార్లమెంటులో నిర్వహించిన ప్రధాని ఎన్నికలో షెహబాజ్‌ తన ప్రత్యర్థి పిటిఐ మద్దతు కలిగిన ఒమర్‌ అయూబ్‌ ఖాన్‌పై విజయం సాధించారు. షెహబాజ్‌కు 201 ఓట్లు రాగా, అయూబ్‌ ఖాన్‌కు 92 ఓట్లు వచ్చాయి. షహబాజ్‌ ప్రధానిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. షెహబాజ్‌ 2022 ఏప్రిల్‌ నుండి ఆగస్టు 2023 వరకు మొదటి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు.షెహబాజ్‌ ప్రధానిగా ఎన్నికైనట్లు పాక్‌ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు) స్పీకర్‌ సర్దార్‌ అయాజ్‌ సాదిఖ్‌ ప్రకటించిన వెంటనే ఆయన తన సోదరుడు పాకిస్తాన్‌ ముస్లింలీగ్‌ (ఎన్‌) నేత నవాజ్‌ షరీఫ్‌ను ఆలింగనం చేసుకున్నారు. పాకిస్తాన్‌ను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు మేధావులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, మత పెద్దలతో సహా అందరి సలహాలు తీసుకుని పాక్‌ నావను ఒడ్డుకు చేరుస్తానని అన్నారు. విద్యుత్‌, పన్నుల చౌర్యాన్ని అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. తనపై విశ్వాసం ఉంచి రెండోసారి సభా నాయకుడిగా ఎన్నుకున్నందుకు తన సోదరుడికి, మిత్ర పక్షాలకు షెహబాజ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

➡️