విశ్వాస పరీక్షలో కేజ్రీవాల్‌ సర్కార్‌ విజయం

62 మంది ఆప్‌ ఎమ్మెల్యేల్లో 54 మంది హాజరు

న్యూఢిల్లీ : అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో మరోసారి విజయం సాధించింది. ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని సిఎం కేజ్రీవాల్‌ శుక్రవారం ప్రవేశపెట్టారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం విశ్వాస పరీక్షను కోరడం ఇది రెండోసారి. 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి 62 మంది, బిజెపికి ఎనిమిదిమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిఎంతో సహా 54 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు హాజరై తీర్మానానికి మద్దతు తెలిపారు. దీంతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. ప్రతిపక్ష బిజెపికి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌లో ఉన్నారు. తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా కేజ్రీవాల్‌ సభలో మాట్లాడుతూ సభలో లేనివారిలో కొందరు జైలులో, ఇద్దరు అనారోగ్యంగా, మరో ఇద్దరు ప్రయాణంలో ఉన్నారని తెలిపారు. ‘ఆపరేషన్‌ లోటస్‌’ సఫలం కాలేదని మరోసారి నిరూపించటమే తీర్మానం ఉద్ధేశమని సిఎం చెప్పారు. 21 మంది ఆప్‌ ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు అంగీకరించారని, మరికొంతమంది బిజెపితో టచ్‌లో ఉన్నారని తమ పార్టీ ఎమ్మెల్యేలకు చెబుతున్నారని తెలిపారు. రూ.25 కోట్లు చొప్పున ఇస్తామని చెబుతున్నారని, తాము తిరస్కరించామని తమ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారని కేజ్రీవాల్‌ అన్నారు. తమ పార్టీలో ఏడుగురితోనే సంప్రదించారని, మిగిలిన వారితో మాట్లాడలేదని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలెవరూ ఫిరాయించడం లేదని, ఆప్‌తోనే స్ధిరంగా ఉన్నారని తెలిపారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే, ఢిల్లీ అసెంబ్లీని బిజెపి రద్దు చేస్తుందని ప్రచారం చేస్తున్నారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. బిజెపికి అతి పెద్ద సవాల్‌గా ఆప్‌ ఉండటం వల్లే తమ పార్టీపై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోందని అన్నారు. తనను అరెస్టు చేయాలని బిజెపి భావిస్తోందని చెప్పారు. వర్చువల్‌గా కోర్టుకు హాజరైన కేజ్రీవాల్‌కేజ్రీవాల్‌ శనివారం రౌస్‌ అవెన్యూ కోర్టు ఎదుట వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు. ఎక్సైజ్‌ పాలసీ కేసులో తాను జారీ చేసిన సమన్లను ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదంటూ ఇడి పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఆయన వర్చువల్‌గా న్యాయస్థానంలో హాజరయ్యారు. సభలో విశ్వాస పరీక్ష జరుగుతోందని, వచ్చే నెలలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయని, ఇవన్నీ పూర్తయిన తర్వాత వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని కేజ్రీవాల్‌ అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ దివ్య మల్హోత్రాకు విన్నవించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.

➡️