వెల్లువెత్తిన నిరసనలు !

Mar 12,2024 23:30 #CAA nirasana

అస్సాం, బెంగాల్‌ల్లో ఆందోళనలు

పోరాటం కొనసాగిస్తామన్న ప్రతిపక్షాలు

న్యాయ పరిధిలో వుంటే ఎలా అమలు చేస్తారని ప్రశ్న

ఓట్ల కోసమే ఈ చర్యలంటూ విమర్శలు

అస్సాంలో సంపూర్ణ బంద్‌కు పిలుపు

న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో బిల్లును ఆమోదించిన నాలుగేళ్ల తర్వాత పౌరసత్వ సవరణ చట్టాంసిఎఎ నిబంధనలను సోమవారం రాత్రి మోడీ ప్రభుత్వం ప్రకటించడంతోనే అస్సాంలో విస్తృతంగా నిరసనలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు సోమవారం కొనసాగాయి. ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్శిటీ ఆర్ట్స్‌ ఫ్యాకల్టీ వద్ద విద్యార్థులు నిరసన తెలిపారు. సిఎఎను వ్యతిరేకిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. సుమారు 70 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్బంధించిన విద్యార్థులు బురారీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించామని, తరువాత విడిచిపెట్టామని డిసిపి (నార్త్‌) మనోజ్‌ మీనా తెలిపారు. షహీన్‌బాగ్‌, జామియానగర్‌, ఈశాన్యప్రాంతం, జామియా మిలియా క్యాంపస్‌లలో భారీగా పోలీసులను మోహరించారు.అయినప్పటికీ సోమవారం రాత్రి జామియా మిలియా క్యాంపస్‌లో కొద్దిమంది విద్యార్థులు నిరసన తెలిపారు.

అస్సాంలో ప్రతిపక్ష పార్టీలు, ఆల్‌ అస్సాం స్టూడెంట్స్‌ యూనియన్‌ (అసు) వంటి వివిధ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా సిఎఎ కాపీలను అసు కార్యకర్తలు దగ్ధం చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసనలకు, ఆందోళనలకు దిగితే అణచివేస్తామని డిజిపి హుకుం జారీ చేశారు.

యునైటెడ్‌ అపోజిషన్‌ ఫోరమ్‌-అస్సాం (యుఓఎఫ్‌ఎ) బ్యానర్‌ కింద మొత్తంగా 16 ప్రతిపక్ష పార్టీలు మంగళవారం నాడు సంపూర్ణ బంద్‌కు పిలుపునిచ్చాయి. సిఎఎకు వ్యతిరేకంగా శివసాగర్‌లో మంగళవారం నిరసనలు చేస్తున్న కృషక్‌ ముక్తి సంగ్రామ్‌ సమితి, ఛత్ర ముక్తి సంగ్రామ్‌ సమితి, రాజోర్‌ దళ్‌లకు చెందిన కార్యక్తలను అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అస్సాం ఒప్పందం అమలును తాము స్వాగతిస్తామని యుఓఎఫ్‌ఎ ఒక ప్రకటనలో తెలిపింది. అక్రమ విదేశీయుల భారాన్ని అస్సాం ఎంత మాత్రమూ ఆమోదించలేదని పేర్కొంది. 1971 మార్చి 25న లేదా ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చిన విదేశీయులందరినీ ఎన్నికల జాబితాల నుండి తొలగిస్తామని, వారిని తరలించేందుకు చర్యలు తీసుకుంటామని అస్సాం ఒప్పందం పేర్కొంటోంది.

‘సిఎఎను మేం ఎంత మాత్రమూ ఆమోదించబోం. దీనివల్ల అస్సామీ కమ్యూనిటీ నాశనమవుతుంది. మా భాష, సంస్కృతి, సాహిత్యం, గుర్తింపు అన్నీ నిర్మూలించబడతాయి.” అని యుఓఎఫ్‌ఎ ఒక ప్రకటనలో పేర్కొంది. పార్లమెంట్‌ లోపల, వెలుపల తాము సిఎఎపై పోరాడతామని ఆసు ప్రకటించింది. అహింసా పద్ధతిలో, శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా సిఎఎ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఆసు సలహాదారు సముజ్జల్‌ భట్టాచార్య మీడియాకు తెలిపారు. దీంతో పాటూ చట్టపరమైన పోరాటాన్ని కూడా కొనసాగిస్తామన్నారు.

రాజోర్‌ దళ్‌ అద్యక్షుడు అఖిల్‌ గొగి మాట్లాడుతూ.. సిఎఎను అమలు చేసినట్లైతే, తమ జీవనోపాధికి, గుర్తింపునకు ప్రమాదమని ఒక వర్గం ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ఈ ఒక్క చర్యతో, ఇన్నేళ్ళుగా అక్రమ ఇమ్మిగ్రేషన్‌కు వ్యతిరేకంగా అస్సాం సాగిస్తూ వచ్చిన పోరాటం పనికి రాకుండా పోయిందన్నారు. బంగ్లాదేశ్‌లో నివసిస్తున్న 1.7కోట్ల మంది హిందువులు అస్సాంలోకి రావడానికి కూడా ఈ చర్య ద్వారాలు తెరుస్తుందన్నారు. ఎఐయుడిఎఫ్‌ ఎంఎల్‌ఎ అష్రఫుల్లా హుస్సేన్‌ మాట్లాడుతూ, బంగ్లాదేశీ హిందువుల ఓట్లను ఆశించే ఎన్నికల ముందు బిజెపి ఈ చర్య అమలు చేస్తోందని విమర్శించారు. 1971 మార్చి 25కి ముందు వచ్చిన ఎవరికైనా భారత పౌరసత్వం ఇవ్వడానికి తాము అనుకూలమేనని, కానీ దాన్ని ఏ మతంతో లేదా కమ్యూనిటీతో ముడిపెట్టరాదని అన్నారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సుప్రకాష్‌ తాలుక్‌దర్‌ మాట్లాడుతూ, సిఎఎ జ్యుడీషియల్‌ పరిధిలో వున్నందున దీన్ని అమలు చేసే ఉద్దేశ్యం లేదని అన్న ప్రభుత్వం ఇప్పుడు ఎలా తీసుకువచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.అస్సాం ఆప్‌ అధ్యక్షుడు బాబెన్‌ చౌదరి మాట్లాడుతూ, అస్సాం చరిత్రలో ఇదొక దుర్దినమని వ్యాఖ్యానించారు. ఈ చర్య తీసుకున్న బిజెపి ఒక దేశద్రోహిగా గుర్తుండిపోతుందని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా జరపతలపెట్టిన హర్తాళ్‌ను ఉపసంహరించాలంటూ అస్సాం పోలీసులు ప్రతిపక్షాలకు నోటీసులు ఇచ్చాయి. తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పశ్చిమ బెంగాల్‌లో పరస్పర విరుద్ధమైన ప్రతిస్పందనలు

రాజవంశీల వ్యతిరేకత

సిఎఎ అమలు చేస్తూ కేంద్రం తీసుకున్న చర్యలతో ఉత్తర బెంగాల్‌లో ముఖ్యంగా రాజవంశి కమ్యూనిటీలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. తమకు సిఎఎ వద్దని, ఎన్‌ఆర్‌సి కావాలని రాజవంశీ కమ్యూనిటీ నేత వంశి బదాన్‌ బర్మన్‌ వ్యాఖ్యానించారు. సిఎఎను బలవంతంగా అమలు చేయాలని భావిస్తే, ముందు ప్రజలతో చర్చలు జరపాలని, ఆ తర్వాత చర్యలు తీసుకోవాలని అన్నారు. బెంగాల్‌ను మరోసారి విభజించేందుకు ఇదొక ఎత్తుగడ చర్య అని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం విమర్శించారు. మరోసారి ఎవరూ శరణార్ధులు కావడానికి అనుమతించేది లేదన్నారు. సిఎఎను, ఎన్‌ఆర్‌సిని అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఉత్తర 24 పరగణాలోని హబ్రాలో ర్యాలీలో ఆమె ప్రసంగించారు. బిజెపి చర్యలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆడిన డ్రామాగా సిపిఎం నాయకులు విమర్శించారు. ప్రజల్లో అయోమయం, గందరగోళం సృష్టించడమే వారి ఉద్దేశ్యమన్నారు. కాగా మరోవైపు ఉత్తర 24 పరగణాలు, నడియాల్లో ప్రధానంగా వున్న మతువా కమ్యూనిటీ ఈ చర్య పట్ల హర్షం వ్యక్తం చేసింది.

ఆమోదయోగ్యం కాదు : తమిళ సూపర్‌స్టార్‌ విజయ్

కేంద్రం తీసుకువచ్చిన చర్య తమకు ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని తమిళ్‌ సూపర్‌స్టార్‌ విజరు వ్యాఖ్యానించారు. విచ్ఛిన్నకర రాజకీయాలే లక్ష్యంగా దీన్ని అమల్లోకి తెస్తున్నారన్నారు. ప్రజలు సామాజిక సామరస్యతతో జీవించే ఈ దేశంలో ఇటువంటి చర్యలు ఎంత మాత్రమూ అనుమతించలేమన్నారు.

➡️