శంకరయ్యకు కన్నీటి వీడ్కోలు

Nov 17,2023 08:39 #CPIM, #Shankaraiah
  • అంతిమ యాత్రలో అశేష జనవాహిని
  • ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
  • సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కరత్‌ హాజరు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : శతాబ్ది పోరాట యోధుడు, విప్లవ సూరీడు ఎన్‌. శంకరయ్యకు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. ప్రజల సందర్శనార్థం టి నగర్‌లోని పి రామ్మూర్తి స్మారక చిహ్నం వద్ద వుంచిన ఆయన భౌతిక కాయాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. వీరిలో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసులవారు ఉన్నారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు, కార్యకర్తలు తండోపతండాలుగా రావడంతో టి గనర్‌, ఆ పరిసర ప్రాంతాలు జనం రద్దీతో కిటకిటలాడాయి. కొందరు ద్ణుఖాన్ని ఆపుకోలేక కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం బసంత్‌నగర్‌లోని స్మశాన వాటిక వరకు ఆయన అంతిమయాత్ర జన ప్రవాహంలా సాగింది. పార్టీ అగ్ర నాయకులు సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కరత్‌ , మాజీ కేంద్ర మంత్రి, డిఎంకె ఎంపి ఎ.రాజా, సిపిఎం రాష్ట్ర నాయకులు అగ్రభాగాన నిలిచారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆ ప్రజానాయకుని మృతికి గౌరవ సూచకంగా, పోలీసులు ఆరు తుపాకులతో పది రౌండ్లు గాలిలో పేల్చారు.

ఆయనకు నివాళులర్పించినవారిలో తమిళనాడు సిపిఎం రాష్ట్ర నాయకులు రామకృష్ణన్‌, సిపిఎం కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌, అఖిల భారత కిసాన్‌ సభ అధ్యక్షుడు అశోక్‌ థావలే, ఐద్వా అధ్యక్షురాలు పికె శ్రీమతి, సిపిఎం కేరళ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పికె బిజు, డివైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షుడు ఎఎ రహీమ్‌, సినీ నటులు పార్తీపన్‌, సత్యరాజ్‌, సినీనటి రోహిణి తదితరులు ఉన్నారు.

బసంత్‌ నగర్‌ స్మశానవాటిక వద్ద ఏర్పాటు చేసిన శంకరయ్య సంతాప సభలో సీతారాం ఏచూరి, ప్రకాశ్‌ కరత్‌, అశోక్‌ దావలేతో పాటు డిఎంకే ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఆర్‌ఎస్‌ భారతి, పెరియర్‌ సంఘం నేత కె. వీరమణి, సిపిఐ సహాయ కార్యదర్శి పెరియర్‌ స్వామి, సీనియర్‌ జర్నలిస్టు ఎన్‌.రామ్‌, ఎండిఎంకె ఎంపి వైగో, విసికె ఎంపి తిరుమవలవన్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలను నిర్మించడంలో శంకరయ్య నిర్వహించిన పాత్రను వారు గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి, కమ్యూనిస్టు ఉద్యమం, కుల వ్యతిరేక, అంటరానితనం వ్యతిరేక పోరాటాలు, సంస్కరణోద్యమాలు గురించి వివరించారు. తమిళనాడు అభ్యుదయ ఉద్యమంలో ఎన్‌.శంకరయ్య పాత్రను గుర్తు చేసుకున్నారు.

 

 

 

➡️