సిఎఎపై పోరులో కాంగ్రెస్‌ వాణి ఏది? – నిలదీసిన విజయన్‌

తిరువనంతపురం : పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ)పై పోరాటంలో కాంగ్రెస్‌ వాణి తగినంతగా వినిపించడం లేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. సిఎఎ సాకుతో దేశంలో మతోన్మాద ధోరణులను రెచ్చగొట్టడానికి మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించాలని ఆయన పిలుపునిచ్చారు. కేరళలో చేపట్టిన ఎన్నికల ప్రచారం సిఎఎపై ప్రజలను చైతన్యవంతులను చేసే విధంగా రూపుదిద్దుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఎల్‌డిఎఫ్‌ నేతృత్వంలో సిఎఎ వ్యతిరేక నిరసనలు ఉధృతంగా జరుగుతున్నాయి. వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. ఈ దిశగా మొదటగా భరణఘటన సంరక్షణ సమితి (రాజ్యాంగ పరిరక్షణ కమిటీ) ఆధ్వర్యంలో ఐదు రాత్రివేళ సభలు నిర్వహించనున్నారు. వీటిలో మొదటిది కొజికోడ్‌లో శుక్రవారం నిర్వహించగా..ఆ ర్యాలీకి లక్షలాది మంది హాజరయ్యారు. రెండో సభ కాసర్‌గడ్‌ జిల్లాలోని కన్హన్‌గడ్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయన్‌ మాట్లాడుతూ ముస్లింలను రెండో తరగతి పౌరులుగా వ్యవహరించడాన్ని అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ పోరాటలో వామపక్షాలను మాత్రమే విశ్వసించగలమన్నారు. సిఎఎపై పోరులో కేరళ ప్రభుత్వం అగ్ర భాగాన వుంటుందన్నారు. కేరళ నుండి గెలిచిన లోక్‌సభ సభ్యుల్లో కేవలం ఎఎం అరిఫ్‌ మాత్రమే దిగువ సభలో తన వాణి వినిపించారని అన్నారు. రాజ్యసభలో ఎలమరమ్‌ కరీం, వినరు విశ్వం, కెకె రాజేష్‌లు బిల్లును వ్యతిరేకించారని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు ఎక్కడా కూడా తమ వాణిని వినిపించలేదన్నారు. ఢిల్లీలో సిఎఎకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టినప్పుడు .. ఆందోళనకారులను కాల్చివేయాలని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ నినాదాలు చేశారని, దీనిపై సిపిఎం నేత బృందాకరత్‌ కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. ఈ పోరాటంలో కాంగ్రెస్‌ ఎక్కడుందో చెప్పాలని ఆయన నిలదీశారు. సిఎఎపై ప్రజాతంత్ర శక్తులన్నీ ఒక్కతాటిపై నిలిచి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

➡️