కొనసాగుతున్న ఆందోళన .. 14 మంది ఎంపిలపై సస్పెన్సన్‌ వేటు

 న్యూఢిల్లీ  :    సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ  14 మంది ఎంపిలపై లోక్‌సభ వేటు వేసింది.  శీతాకాల సమావేశాలు పూర్తయ్యేంతవరకు వీరిని సస్పెండ్‌ చేస్తున్నట్లు గురువారం లోక్‌సభలో తీర్మానాన్ని ఆమోదించింది. వీరిలో ఐదుగురు కాంగ్రెస్‌ ఎంపిలు ఉన్నారు.

తొలుత ఐదుగురిని సస్పెండ్‌ చేయగా.. ఆ తర్వాత మరో 9 మందిని సస్పెండ్‌ చేసింది. మొదట సస్పన్షన్‌కు గురైన వారిలో ప్రతాపన్‌, హిబీ ఈడన్‌, జోతి మణి, రమ్యా హరిదాస్‌, డీన్‌ కురియాకోస్‌ ఉన్నారు. టిఎన్‌. ప్రతాపన్‌, హిబీ ఈడన్‌, జోతిమణి, రమ్యా హరిదాస్‌, డీన్‌ కురియకోస్‌లు స్పీకర్‌ ఆదేశాలను ఉల్లంఘించారని, వారి తీరును తీవ్రంగా పరిగణిస్తూ ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నామని   పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ సభలో పేర్కొన్నారు. ఈ తీర్మానం ఆమోదం పొందిన అనంతరం స్పీకర్‌ సభను మధ్యాహ్నాం 3 గంటల వరకు వాయిదా వేశారు.

మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం కాగానే భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు మరోసారి చర్చకు పట్టుబట్టాయి. దీంతో బెన్నీ బెహనన్‌, వీకే శ్రీకందన్‌, మహమ్మద్‌ జావెద్‌, పీఆర్‌ నటరాజన్‌, కనిమొళి, కె.సుబ్రహ్మణ్యం, ఎస్‌ఆర్‌ పార్థిబన్‌, ఎస్‌ వెంకటేశన్‌, మాణికం ఠాగూర్‌ను సస్పెండ్‌ చేస్తూ సభలో ప్రహ్లాద్‌ జోషీ మరోసారి తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. టిఎంసి ఎంపి డెరెక్‌ ఒబ్రెయిన్‌ సహా మొత్తం 15 మందిపై లోక్‌సభ సస్పెండ్‌ వేటు వేసింది. అనంతరం రేపు ఉదయానికి లోక్‌సభ వాయిదా పడింది.

➡️