బొగ్గు గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులకు రూ.8,500 కోట్లు

Jan 25,2024 08:09 #Coal transportation
  •  ప్రోత్సాహక పథకానికి మంత్రివర్గం ఆమోదం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బొగ్గు గ్యాసిఫికేషన్‌ (ఇంధనీకరణ) ప్రాజెక్టుల కోసం రూ.8,500 కోట్ల ప్రోత్సాహక పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు నిర్ణయాలు తీసుకుంది. అనంతరం నేషనల్‌ మీడియా సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. దేశంలో గ్యాసిఫికేషన్‌ టెక్నాలజీని అవలంబించడం వల్ల సహజ వాయువు, మిథనాల్‌, అమ్మోనియా, ఇతర అవసరమైన ఉత్పత్తుల దిగుమతులపై దేశం ఆధారపడటం తగ్గుతుందని తెలిపారు. 2030 నాటికి 100 మిలియన్‌ టన్నుల (ఎంటి) బొగ్గును గ్యాసిఫై చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. సిఐఎల్‌, గెయిల్‌ కు సంబంధించిన జెవి ద్వారా ఇసిఎల్‌ కమాండ్‌ ఏరియాలో కోల్‌-టు-సైన్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు కోసం, సిఐఎల్‌, బిహెచ్‌ఈఎల్‌ కు సంబంధించిన జెవి ద్వారా ఎంసిఎల్‌ కమాండ్‌ ఏరియాలో బొగ్గు నుండి అమ్మోనియం నైట్రేట్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటు కోసం సిఐఎల్‌ ద్వారా ఈక్విటీ పెట్టుబడిని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. అలాగే, ఇండియా, డొమినికన్‌ రిపబ్లిక్‌ మధ్య జాయింట్‌ ఎకనామిక్‌ అండ్‌ ట్రేడ్‌ కమిటీ స్థాపనకు సంబంధించిన ప్రోటోకాల్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు.

➡️