మోడీకి రైతు సెగ

May 24,2024 08:19 #modi

కనీస మద్దతు ధర అమలు చేయాలని డిమాండ్‌
– పంజాబ్‌ పర్యటనలో ప్రధానికి అడుగడుగునా అడ్డంకులు
– బిజెపి నాయకుల నిలువరింత.. గో బ్యాక్‌ అంటూ నినాదాలు
నల్లజెండాలతో నిరసన
– భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది మోహరింపు
– అన్నదాతలనూ అడ్డుకున్న వైనం.. పలు ఆంక్షలు విధింపు
– తమకు కేటాయించిన ప్రాంతంలో వందలాది మంది రైతుల ర్యాలీ
– మూడు రహదారుల దిగ్బంధం
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీకి రైతు సెగ తగిలింది. దశాబ్దకాలంగా తమను మోసం చేస్తున్నారంటూ మోడీకి వ్యతిరేకంగా రైతులు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. దీంతో పోలీసులకు, భద్రతా బలగాలకు ముచ్చెమటలు పట్టాయి. పంజాబ్‌లోని పాటియాలలో మోడీ ఎన్నికల ప్రచారం భారీ భద్రత నడుమ సాగింది. రైతులు మార్చ్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పాటియాలలో మోడీ నిర్వహిస్తున్న సభ వేదిక వరకూ పోలీసు అధికారులు భారీ భద్రతను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మోడీ పర్యటన, రైతుల నిరసన మార్చ్‌ నేపథ్యంలో 5,500 మంది పోలీసులు, భద్రతా సిబ్బంది విధుల్లో పాల్గన్నారు. రైతులు పాటియాలలోకి ప్రవేశించకుండా నిరోధించటానికి, వాహనాల కదలికను నియంత్రించటానికి ర్యాలీ వేదికను పూర్తిగా చుట్టుముడుతూ ఎంట్రీ పాయింట్ల వద్ద ఇసుకతో నింపిన ట్రక్కులను భద్రతా అధికారులు ఉంచారు. దీంతో పంజాబ్‌లో బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని గురువారం సాయంత్రం ప్రారంభించటానికి మోడీ పర్యటనకు ముందు పాటియాలా ఒక ఉద్రిక్తమైన వాతావరణాన్ని చూసింది.
సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్కేఎం)కు చెందిన రాజకీయేతర, రాజకీయ వర్గాలు, భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ, ఉగ్రహన్‌), కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా(కేఎంఎం) సహా అనేక రైతు సంఘాలు ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి. ఆయన పర్యటనలో నల్ల జెండాలు చూపించాలని రైతులను, నిరసనకారులను కోరాయి. దీంతో పోలీసు ఉన్నతాధికారులు భద్రతను పెంచారు. వాస్తవానికి, సాయంత్రం ఐదు గంటలకు షెడ్యూల్‌ చేయబడిన మోడీ ర్యాలీకి కొన్ని గంటల ముందు నుంచే కొంత మంది రైతులు పాటియాలా ఎంట్రీ పాయింట్ల వద్ద నిరసనలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. మోడీ ర్యాలీకి వచ్చేవారిని నిర్దేశించిన పార్కింగ్‌ ప్రాంతాలకు ఆదేశించారు. వేదిక వద్దకు కనీసం ఒక కిలోమీటరు నడిచి వెళ్లవలసి వచ్చింది. అన్ని ఎంట్రీ పాయింట్ల వద్ద కూడా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తాము శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని రైతులు తెలిపారు. సింభు, ఖనౌరీతో పాటు తమను అనుమతించిన ఇతర సరిహద్దు ప్రాంతాల్లో రైతులు సమావేశమయ్యారు. తమ డిమాండ్ల సాధన కోసం కేంద్రానికి వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటం వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో రైతులు గుమిగూడారు. భద్రతా దళాలు, పోలీసులు రైతులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిరోధించటంతో అన్నదాతలు సరిహద్దు ప్రాంతాల్లోనే ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
రైతులు మూడు రహదారులను దిగ్బంధం చేశారు. పాటియాలలోని అడ్మినిస్ట్రేటివ్‌ కాంప్లెక్స్‌ వద్ద తమకు కేటాయించిన ప్రదేశంలో రైతులు వందలాది మందిగా చేరి ర్యాలీ చేపట్టారు. కొందరు రైతులు గురువారం ఉదయం ధరేరి జట్టన్‌ టోల్‌ ప్లాజా వద్ద గుమిగూడి ర్యాలీకి అంతరాయం కలిగించకుండా నిరసన తెలిపారు. బీజేపీ నేత జగదీష్‌ జగ్గా, ఆయన మద్దతుదారులు ప్రయాణిస్తున్న బస్సులను రైతులు మోడీ పాటియాలా ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకున్నారు. తాము ఉదయాన్నే వచ్చామని సిద్ధూపూర్‌కు చెందిన మరో రైతు కార్యకర్త దర్శన్‌ సింగ్‌ తెలిపారు. టోల్‌ ప్లాజా వద్ద రైతులు మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండగా.. ”మేము ఇక్కడే ఉంటాం కానీ బీజేపీ నాయకులు తమ మద్దతుదారులను ముందుకు తీసుకెళ్లడానికి అనుమతించం” అని ఆయన అన్నారు. ఇంతలో, ఎస్కేఎం (నాన్‌ పొలిటికల్‌) పిలుపు మేరకు రైతులు గురువారం మధ్యాహ్నం శంభు సరిహద్దు నుంచి పాటియాలాకు వెళ్లటం ప్రారంభించారు. పోలీసులు వారిని నిరోధించారు.
గతంలోనూ మోడీకి రైతుల నుంచి వ్యతిరేకత
ప్రధాని మోడీ పంజాబ్‌ పర్యటనలో రైతుల ఆగ్రహాన్ని ఎదుర్కోవటం ఇదే మొదటిసారి కాదు. 2022లో, ఫిరోజ్‌పూర్‌ సమీపంలోని ఫ్లై ఓవర్‌పై రైతుల నిరసన కారణంగా మోడీ కాన్వారుకు అంతరాయం ఏర్పడింది. దిగ్బంధం కారణంగా.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ర్యాలీలో ప్రసంగించే ప్రణాళికలను మోడీ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
రైతుల నిరసనలు దేనికి?
వివిధ రైతు సంఘాలతో అనుబంధం ఉన్న రైతులు తమ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) చట్టంతో సహా తమ వివిధ డిమాండ్లను నెరవేర్చనందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ వైపు వెళ్లకుండా తమను పంజాబ్‌, హర్యానాలోని శంభు, ఖానౌరీ సరిహద్దు పాయింట్ల వద్ద వారిని బలవంతంగా క్యాంప్‌ను ఏర్పాటు చేసేలా ఒత్తిడి చేయటంపైనా రైతన్నలు ఆగ్రహంతో ఉన్నారు. సిర్హింద్‌ రోడ్‌లోని ఫగ్గన్‌ మజ్రా వద్ద పాటియాలా, పాత్రన్‌ రోడ్‌లోని అసర్‌పూర్‌ చుప్కీ, గురుద్వారాస్‌ పరమేషర్‌ ద్వార్‌ సంగ్రూర్‌ రోడ్‌, రఖ్రా మాండౌర్‌ నభా రోడ్‌, ఖాసియాన్‌ పెహౌవా రోడ్‌ వద్ద ఐదు ఎంట్రీ పాయింట్ల వద్ద నిరసనకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.

➡️