ఎన్‌టిఎకి వ్యతిరేకంగా ఐక్య పోరాటం

  • నేడు జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన
  • రేపు దేశవ్యాప్త బంద్‌
  •  విద్యార్థి సంఘాల వెల్లడి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ)కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఐక్య పోరాటానికి విద్యార్థి సంఘాలు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నేడు (బుధవారం) ఆందోళన చేపట్టనున్నారు. రేపు (గురువారం) దేశవ్యాప్తంగా బంద్‌ నిర్వహించనున్నారు. మంగళవారం నాడిక్కడ ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా(పిసిఐ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌యుఐ, ఎఐఎస్‌ఎ, సిఆర్‌జెడి, సమాజ్వాది ఛత్ర సభ నాయకులు ఈ వివరాలు వెల్లడించారు. డిఎంకె విద్యార్థి విభాగం, పిఎస్‌యు, పిఎస్‌ఎఫ్‌, ఎఐఎస్‌బి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూఖ్‌ బిస్వాస్‌ మాట్లాడుతూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ)కి వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు ఉమ్మడి వేదిక ఏర్పడిందన్నారు. గడిచిన నెల రోజులుగా నీట్‌కు సంబంధించిన మోసాలు, నెట్‌తోపాటు జాతీయ స్థాయి పరీక్షలను నిర్వహించడంలో యుజిసి వైఫల్యం, ఎన్‌టిఎ అసమర్థత బట్టబయలయ్యాయని పేర్కొన్నారు. ఎన్‌టిఎను రద్దు చేయాలని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేస్తున్నారని గుర్తు చేశారు.
ఎఐఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షులు విరాజ్‌ దేవాంగ్‌ మాట్లాడుతూ దేశవ్యాప్త ఉమ్మడి ఉద్యమంలో భాగంగా విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలని పిలుపు ఇచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐకెఎస్‌ఎఫ్‌, పిఎస్‌యు, ఎఐఎస్‌బి సంఘాలు రేపు (గురువారం) దేశవ్యాప్త బంద్‌కు పిలుపు ఇచ్చాయని తెలిపారు. ఈ బంద్‌కు ఎన్‌ఎస్‌యుఐ, ఎఐఎస్‌ఎ, ప్రగతిశీల విద్యార్థి సంఘాలు మద్దతు ఇచ్చాయని పేర్కొన్నారు. ఎన్‌ఎస్‌యుఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్‌ చౌదరి మాట్లాడుతూ ఈ అంశాన్ని పార్లమెంట్‌ లేవనెత్తడానికి ఇండియా బ్లాక్‌ నేతలకు మెమోరాండం ఇస్తున్నామని అన్నారు. ఎన్‌టిఎ, ఇతర ఉమ్మడి పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని, ఎన్‌టిఎని నిషేధించాలని డిమాండ్‌ చేశారు. పారదర్శకత, సమర్ధతతో కూడిన పరీక్ష నిర్వహణ ఏర్పాటు చేయాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని పేర్కొన్నారు.
ఎఐఎస్‌ఎ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రసేన్‌జీత్‌ మాట్లాడుతూ మళ్లీ నీట్‌ నిర్వహించాలని, విద్యార్థుల సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చెందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, యూనివర్శిటీల్లో ఆందోళన చేపడతామని అన్నారు. సమాజ్‌బాదీ ఛత్ర సభ జాతీయ అధ్యక్షుడు ఇమ్రాన్‌ మాట్లాడుతూ 2024 బ్యాచ్‌కి మాత్రమే రీ-నీట్‌ కొనసాగించాలని, నీట్‌, సియుఈటి వంటి జాతీయ ఉమ్మడి పరీక్షలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సిఆర్‌జెడి నేత అక్షన్‌ రంజన్‌ మాట్లాడుతూ నీట్‌, నెట్‌, ఇతర ప్రవేశ, నియామక పరీక్షల్లో అవకతవకలకు సంబంధించి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, విధాన నిర్ణయదారులతో చర్చలు ప్రారంభించాలని మోడీ సర్కార్‌ను డిమాండ్‌ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి ఆదర్శ ఎం.సాజి, కేంద్ర కమిటీ సభ్యురాలు ఐషీఘోష్‌, ఎంఎస్‌ఎఫ్‌ నేత అహ్మద్‌ సాజు తదితరులు పాల్గొన్నారు.

➡️