ఆధార్‌-పాన్‌ లింక్‌ పెనాల్టీతోరూ. 600 కోట్ల వసూలు

Feb 6,2024 11:19 #Aadhaar-PAN, #penalty

న్యూఢిల్లీ :     ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయడంలో జాప్యంపై విధించిన పెనాల్టీతో ప్రజల వద్ద నుంచి రూ.601.97 కోట్లను కేంద్ర ప్రభుత్వం వసూలు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సోమవారం లోక్‌సభలో లిఖిత పూర్వక సమాధానం ద్వారా వెల్లడించారు. కేవలం 2023 జులై 1 నుంచి 2024 జనవరి 31 వరకూ మధ్యకాలంలో ఈ భారీ మొత్తాన్ని వసూలు చేసినట్లు తెలిపారు.   మినహాయింపు ఇచ్చిన కేటగిరీలు మినహా 2024 జనవరి 29 నాటికి ఇంకా ఆధార్‌తో లింక్‌ చేయని పాన్‌ల సంఖ్య 11.48 కోట్లుగా ఉందని మంత్రి వెల్లడించారు.   ఆధార్‌తో పాన్‌ను లింక్‌ చేయడానికి చివరి జూన్‌ 30, 2023 తరువాత కూడా లింక్‌ చేయని వ్యక్తులపై విధిస్తున్న  పెనాల్టీ రూ.1000  ద్వారా ప్రభుత్వం సంపాదించిన మొత్తం వివరాల గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ సమాధానం ఇచ్చారు.  ఆధార్‌తో లింక్‌ చేయని పాన్‌ కార్డులు జులై 1, 2023 నుంచి చెల్లుబాటు కావని ఆదాయపన్ను శాఖ గతంలోనే ప్రకటించింది.   రూ. 1000 పెనాల్టీ రుసుము చెల్లించడం ద్వారా ఇలాంటి కార్డులను మళ్లీ క్రియాశీలం చేయవచ్చునని పేర్కొంది.

➡️