ఆప్‌ ఎంపి రాఘవ్‌ చద్దా సస్పెన్షన్‌ను ఎత్తివేసిన రాజ్యసభ

Dec 4,2023 15:39 #AAP MP, #Rajya Sabha, #Suspension

న్యూఢిల్లీ :   ఆప్‌ ఎంపి  రాఘవ్‌ చద్దాపై సస్పెన్షన్‌ను రాజ్యసభ సోమవారం ఎత్తివేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభమైన సంగతి తెలిసిందే. సమావేశాల మొదటి రోజున బిజెపి ఎంపి జివిఎల్‌ నరసింహారావు చేసిన తీర్మానాన్ని అనుసరించి సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ”ప్రత్యేక హక్కుల ఉల్లంఘన” ఆరోపణలపై రాజ్యసభ రాఘవ్‌ చద్దాపై ఈ ఏడాది ఆగస్టు 11 నుండి 115 రోజులపాటు సస్పెండ్‌ విధించింది.

ఢిల్లీ సర్వీసెస్‌ ఆర్డినెన్స్‌ అధ్యయన కమిటీ సభ్యులుగా వారి అనుమతి లేకుండానే అధికార బిజెపికి చెందిన ఇద్దరు సహా నలుగురు రాజ్యసభ ఎంపిలను ప్రతిపాదించేందుకు చద్దా ఫోర్జరీ సంతకాలు చేసినట్లు బిజెపి ఆరోపించింది.

ఈ ఆరోపణలను చద్దా తిప్పికొట్టారు. బిజెపి తనను లక్ష్యంగా చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసత్యాన్ని వెయ్యిసార్లు చెప్పే అది వాస్తవం అవుతుంది అనేది బిజెపి సూత్రం. ఈ సూత్రంతోనే తనపై దుష్ప్రచారాన్ని ప్రారంభించారని, తాను ఎవరి సంతకాన్ని ఫోర్జరీ చేశానో సాక్ష్యాలు చూపాలని బిజెపికి సవాలు విసిరారు. సెలెక్ట్‌ కమిటీకి పేర్లను ప్రతిపాదించడానికి ఎంపి సంతకం లేదా వ్రాతపూర్వక సమ్మతి అవసరం లేదని రాజ్యసభ నిబంధనల పుస్తకంలో అంశాన్ని ప్రస్తావించారు. తన సస్పెన్షన్‌ను సవాలు చేస్తూ చద్దా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు.

➡️