ఐదేళ్ల తర్వాత భారత్‌లో బర్డ్‌ప్లూ కేసు : డబ్ల్యుహెచ్‌ఓ

Jun 12,2024 13:30 #birdflu, #WHO

 

పశ్చిమబెంగాల్లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్‌ఫ్లూ

జెనీవా : పశ్చిమ బెంగాల్‌లోని నాలుగేళ్ల చిన్నారికి H9N2 వైరస్‌ వల్ల బర్డ్‌ఫ్లూ సోకిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం వెల్లడించింది. 2019లో భారత్‌లో బర్డ్‌ఫ్లూ కేసు వెలుగు చూసింది. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఈ వైరస్‌ సోకిన రెండవ కేసు అని డబ్ల్యుహెచ్‌ఓ తెలిపింది. ఈ మేరకు డబ్ల్యుహెచ్‌ఓ ప్రకటనను విడుదల చేసింది. అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనలు (ఐహెచ్‌ఆర్‌) నేషనల్‌ ఫోకల్‌ పాయింట్‌ (ఎన్‌ఎఫ్‌పి)లు సమాచారం మేరకు భారతదేశంలో పశ్చిమబెంగాల్‌కి చెందిన నాలుగేళ్ల చిన్నారికి ఏవియన్‌ ఇన్‌ఫ్లూఎంజా ఎ (H9N2) వైరస్‌ సోకినట్లు కేసు నమోదైంది. ఈ చిన్నారి ఈ ఏడాది ఫిబ్రవరిలో అనారోగ్యానికి గురయ్యాడు. అధిక జ్వరం, పొత్తి కడుపునొప్పితో బాధపడుతూ.. స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. మూడు నెలల అనంతరం డిశ్చార్జ్‌ అయ్యాడు. ఈ చిన్నారి ఇంటి సమీపంలో పౌల్ట్రీ ఫారం ఉంది. దానివల్లే చిన్నారికి బర్డ్‌ఫ్లూ సోకి ఉంటుందని డబ్ల్యుహెచ్‌ఓ తెలిపింది. అయితే ఈ చిన్నారి కుటుంబ సభ్యుల్లో శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఎవరూ లేరని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఈ చిన్నారి టీకా వేయించుకున్నది, లేనిది, యాంటీ వైరల్‌ చికిత్సకు సంబంధించిన వివరాలు లేవని డబ్ల్యుహెచ్‌ పేర్కొంది. ఈ వైరస్‌ వల్ల ప్రజారోగ్యం దెబ్బతినే ప్రమాదం తక్కువేనని డబ్ల్యుహెచ్‌ఓ అంచనా వేసింది.
కాగా, మే 22 వ తేదీన ఆస్ట్రేలియాలో కూడా బర్డ్‌ఫ్లూ వైరస్‌ కేసు నమోదైందని డబ్య్లుహెచ్‌ఓ తెలిపింది. సాధారణంగా యానిమల్‌ ఇన్‌ఫ్లూఎంజా వైరస్‌లు జంతువుల మధ్యే వ్యాపిస్తాయి. కానీ ఈ వైరస్‌లు మానవులకు కూడా సంక్రమించవచ్చు. అంటువ్యాధులు సోకిన జంతువల వల్ల కానీ, కలుషితమైన పరిసరాల ద్వారా కానీ మానవులకు ఈ వైరస్‌ సోకే ప్రమాదముంది.

➡️