గతేడాది రికార్డుస్థాయిలో వెయ్యికిపైగా ఎన్‌జిఒలకు ఎఫ్‌సిఆర్‌ఎ ఆమోదం

Jan 11,2024 11:31 #FCRA, #NGO

న్యూఢిల్లీ  :   గతేడాది రికార్డుస్థాయిలో 1,111 ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జిఒ)లు విదేశీ సహకార (నియంత్రణ) సహకార చట్టం, 2020 (ఎఫ్‌సిఆర్‌ఎ) ఆమోదం పొందాయి. 2014తర్వాత ఇదే అత్యధికమని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో 30 ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జిఒ) ఆమోదం పొందినట్లు ప్రకటించింది.

మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం.. 2014 నుండి 2023 వరకు 3,294 ఎన్‌జిఒలకు తాజా రిజిస్ట్రేషన్‌ మంజూరు చేయబడింది. 2021 మరియు 2022 సంవత్సరాల్లో ఎఫ్‌సిఆర్‌ఎ కింద రిజిస్ట్రేషన్‌ కోసం అందిన మొత్తం 1,615 దరఖాస్తుల్లో 722కి క్లియరెన్స్‌ మంజూరు కాగా 225 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయని గతేడాది డిసెంబర్‌ 19న మంత్రిత్వ శాఖ లోక్‌సభకు వివరించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌సిఆర్‌ఎ, 2010లోని నిబంధనల ప్రకారం అర్హత ప్రమాణాలు లేకపోవడంతో వాటిని తిరస్కరించామని తెలిపింది.

2019-2020,2020-21మరియు 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం 13,520 ఎన్‌జిఒలు రూ.55,741.51 కోట్ల విలువైన విదేశీ విరాళాలను స్వీకరించాయని వెల్లడించింది. జనవరి 10 నాటికి, దేశంలో 16,987 ఎన్‌జిఒలు ఎఫ్‌సిఆర్‌ఎ కింద రిజిస్టరయ్యాయని తెలిపింది.

విదేశాల నుండి విరాళాలు స్వీకరించాలంటే ఎన్‌జిఒలు ఎఫ్‌సిఆర్‌ఎ చట్టం కింద నమోదు తప్పనిసరి. ఆ ఎన్‌జిఒలు సాంస్కృతిక, ఆర్థిక, విద్యా, మతపరమైన లేదా సామాజిక కార్యక్రమాన్ని కలిగి ఉండాల్సి వుంది.

➡️