నేటి నుంచి ఐలు 14వ మహాసభ

Dec 28,2023 09:04 #AILU, #maha sabha
ailu national conference

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :  అఖిల భారత న్యాయవాద సంఘం (ఐలు) 14వ అఖిల భారత మహాసభ గురువారం పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు జరగనున్నాయి. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, న్యాయం, సామ్యవాదం లక్ష్యంతో దేశవ్యాప్తంగా 50,000 కి పైగా న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, న్యాయ అధ్యాపకుల సభ్యత్వం కలిగిన ఐలు మహాసభలు మతోన్మాదంపై పోరాటం, సేవ్‌ రాజ్యాంగం, సేవ్‌ ప్రజాస్వామ్యం నినాదంతో జరుగుతున్నాయి. ప్రారంభానికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ గుప్తా, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. మురళీధర్‌, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అశోక్‌ కుమార్‌ గంగూలీ పాల్గొంటారు. దేశంలో ప్రజాస్వామ్యం, సోషలిజం, చట్టబద్దమైన పాలన, ఒకే నేషన్‌-ఒకే ఎలక్షన్‌ వంటి అనేక అంశాల మీద, రాజ్యాంగపరమైన అంశాలమీద చర్చించనున్నారు. న్యాయవాదుల హక్కుల పరిరక్షణ కోసం, న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ మహాసభలో చర్చించనున్నారు. ఐలు కొత్త కమిటీని ఈ మహాసభలో ఎన్నుకోనున్నారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి 600 మంది న్యాయవాదులు ప్రతినిధులుగా ఈ మహాసభలో పాల్గొనున్నారు. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, న్యాయ ఆధ్యాపకుల సమస్యలను చట్టబద్దంగా పరిష్కరించేందుకు కూలంకషంగా ఈ మహాసభలో చర్చించనున్నారు. ఈ మహాసభని జయప్రదం చేయాలని అఖిల భారత న్యాయవాద సంఘం కార్యదర్శి నర్రా శ్రీనివాస రావు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి మాదవ రావు ఒక ప్రకటనలో కోరారు.

➡️