రక్షణ, ప్రాంతీయ భద్రతపై సులివాన్‌తో అజిత్‌ దోవల్‌ చర్చ

న్యూఢిల్లీ :రక్షణ, ప్రాంతీయ భద్రత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించే విషయమై జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) అజిత్‌ దోవల్‌ సోమవారం అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సులివాన్‌తో చర్చలు జరిపారు. కీలకమైన, కొత్తగా ఆవిర్భవించే సాంకేతికతలపై భారత్‌, అమెరికా చొరవను (ఐసెట్‌) అమలు చేయడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. అలాగే ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు, ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై కూడా చర్చించారు. సోమ, మంగళవారాల్లో సులివాన్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మూడోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీనియర్‌ అమెరికా ప్రభుత్వ అధికారి భారత్‌లో జరుపుతున్న మొదటి పర్యటన ఇది. సీనియర్‌ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నేతలతో కూడిన ప్రతినిధి బృందం ఆయన వెంట వచ్చింది. ప్రతిపాదిత భారత్‌-మధ్య ప్రాచ్యం-యూరప్‌ ఆర్థిక కారిడార్‌ (ఐఎంఇసి) కూడా వీరు చర్చించినట్లు తెలుస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిస్థితులతో ఇప్పటికే ఈ చొరవ అమలులో ఆలస్యం జరిగింది. విదేశాంగ మంత్రి జై శంకర్‌తోకూడా ఆయన భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించినట్లు జైశంకర్‌ ఎక్స్‌లో తెలిపారు. పరస్పర ప్రయోజనాలతో కూడిన ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై భారత్‌-అమెరికా భాగస్వామ్యాన్ని సమీక్షించారు. భారత పరిశ్రమల సమాఖ్య నిర్వహిస్తున్న భారత్‌-అమెరికా ఐసెట్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశం మంగళవారం జరగనుంది. ఈ సమావేశానికి పారిశ్రామిక రంగ సిఇఓలు హాజరవుతారు. గాజాపై ఇజ్రాయిల్‌ దాడుల నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులపై అమెరికా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిన నేపథ్యంలో ఐసెట్‌ సమీక్ష కోసం భారత్‌కు రావాల్సిన పర్యటనను సులివాన్‌ ఈ ఏడాదిలో ఇప్పటికి రెండుసార్లు రద్దు చేసుకున్నారు.

➡️