విద్య కాషాయీకరణపైనే కన్ను!

Apr 22,2024 04:04 #BJP, #books, #Education
  • మోడీ హయాంలో తగ్గుతున్నప్రభుత్వ పాఠశాలలు
  •  ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మైనారిటీలకు దూరమవుతున్న చదువులు
  •  నిలిచిన స్కాలర్‌షిప్‌లు

న్యూఢిల్లీ : కేంద్రంలో ఉన్న మోడీ సర్కారు విద్య కాషాయీకరణను పూర్తి స్థాయిలో అమలు చేస్తూనే… విద్యారంగాన్ని నానాటికీ దిగజారుస్తోంది. మోడీ హయాంలో హిందూ మతతత్వ వాదుల వాదనలకు సరిపోయేలా చరిత్ర, రాజకీయ శాస్త్రం, ఇతర విభాగాల్లో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు విద్యను పొందటంలో అంతరాయం ఏర్పడిందని నిపుణులు, విశ్లేషకులు అంటున్నారు. మోడీ ప్రభు త్వం చేసిన వాగ్దానాలు, విద్యా రంగంలో వాస్తవికతపై ఫైనా న్షియల్‌ అకౌంటబిలిటీ నెట్‌వర్క్‌ ఇండియా (ఎఫ్‌ఏఎన్‌-ఇండి యా).. ‘ఎడ్యుకేషన్‌ రిపోర్ట్‌ కార్డ్‌-2014-24’ రూపొందించింది. ఈ రిపోర్ట్‌ కార్డ్‌ ప్రకారం.. నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఇపి)-2020 ప్రకారం ప్రభుత్వ పాఠశాలల ఏకీకరణ ఇటీవలి సంవత్సరాలలో పెరిగింది. ఇది విద్యా హక్కు చట్టం యొక్క ఉద్దేశాన్నే దెబ్బతీస్తున్నది. 2023లోనే దేశవ్యాప్తంగా నాలుగు వేల పాఠశాలలు విలీనమయ్యాయి. మహారాష్ట్రలో పాఠశాలల విలీనం దాదాపు 2 లక్షల మంది పిల్లలపై ప్రభావం చూపింది. ఒడిశా 7,478 పాఠశాలలను మూసివేసింది. మధ్యప్రదేశ్‌ 35,000 పాఠశాలలను 16,000 స్థాపనలుగా విలీనం చేయాలని ప్రతిపాదించింది. ఈ చర్యలతో మారుమూల ప్రాంతాలలో చిన్నారులకు విద్య దూరమవుతోంది.

61,885 సర్కారు బడుల తగ్గుదల… 47,680 ప్రయివేటు స్కూళ్ల పెరుగుదల
2018-19 నుంచి 2021-22 మధ్య భారత్‌లో మొత్తం పాఠశాలల సంఖ్య 61,885 తగ్గింది. అంటే, 15,51,000 నుండి 14,89,115కి పడిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో అత్యంత ముఖ్యమైన క్షీణత (61,361) నమోదైంది. ప్రయివేటు పాఠశాలల సంఖ్య పెరగటంతో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇది అట్టడుగు వర్గాలకు విద్యను పొందే అవకాశాన్ని పెద్ద ప్రశ్నగా మార్చింది. 2014-15లో దేశవ్యాప్తంగా 11,07,118 ప్రభుత్వ పాఠశాలలు, 83,402 ప్రభుత్వ-ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. 2021-22లో ప్రభుత్వ పాఠశాలలు 10,22,38కి, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలు 82,480కి తగ్గాయి. 2014-15లో ప్రయివేట్‌ పాఠశాలల సంఖ్య 2,88,164 కాగా, 2021-22 నాటికి 3,35,844కి చేరాయి. అంటే, 47,680 ప్రయివేటు స్కూళ్లు పెరిగాయన్నమాట. ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నదని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ నివేదిక సైతం వెల్లడించింది. మంజూరైన 62.71 లక్షల పోస్టులలో 10 లక్షల పోస్టులు రాష్ట్ర స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాలలో అపాయింట్‌మెంట్‌ లెటర్ల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్థూల నమోదు నిష్పత్తి (జిఇఆర్‌) ప్రాథమిక నుంచి ఉన్నత స్థాయి వరకు అన్ని స్థాయిలలో క్షీణతను చూసింది. జిఇఆర్‌ ప్రాథమిక స్థాయిలో 103.39 తగ్గి హయ్యర్‌ సెకండరీ స్థాయిలో 57.56కు చేరుకున్నది. అత్యంత నష్టపోయిన అట్టడుగు వర్గాలుగా ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీలు ఉన్నారు.2022లో 2022-23 విద్యా సంవత్సరానికి ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మతపరమైన మైనారిటీలకు 1-8 తరగతులకు ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు నిలిపివేయబడ్డాయి. ఉన్నత విద్యలోనూ ఈ వర్గాల వారికి వివిధ స్కాలర్‌షిప్‌లు నిలిచిపోయాయి. 2022లో, మోడీ ప్రభుత్వం మైనారిటీల కోసం మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌లను నిలిపివేసింది. ఇక ప్రొఫెషనల్‌, టెక్నికల్‌ కోర్సుల మెరిట్‌-కమ్‌-మీన్స్‌ స్కాలర్‌షిప్‌ కూడా 2013-14లో రూ. 243 కోట్ల నుంచి 2024-25 నాటికి రూ.33.80 కోట్లకు పడిపోయింది.
45 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 33 శాతం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఐఐటిలలో 40 శాతం, ఐఐఎంలలో 31.6 శాతం ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉన్నత విద్యారంగంలో దుస్థితిపై లోక్‌సభలో కేంద్రం సమాధానాన్ని నివేదిక ఉటంకించింది. పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖకు మొత్తం బడ్జెట్‌ వ్యయంలో వాటాగా కేటాయింపులు 2013-14లో 3.16 శాతం నుంచి 2024-25లో 1.53 శాతానికి.. అంటే దాదాపు సగానికి పడిపోయాయి. ఉన్నత విద్యా శాఖకు మొత్తం బడ్జెట్‌ వ్యయంలో వాటాగా కేటాయింపులు 2013-14లో 1.6 శాతం నుంచి 2024-25లో 1 శాతానికి తగ్గాయి. పదేళ్ల పాలనలో మోడీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. గాంధీ హత్యలో హిందూ మతతత్వ సంస్థల పాత్ర, తదుపరి సంఫ్‌ు నిషేధం, ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాల నుంచి 2002లో గుజరాత్‌ మత హింసకు సంబంధించిన సూచనలకు సంబంధించిన పాఠ్యాంశాల్లో వివిధ మార్పులు, తొలగింపుల గురించి ఎఫ్‌ఎఎన్‌ – ఇండియా రిపోర్ట్‌ కార్డ్‌ పేర్కొన్నది. కుల వివక్ష, దళిత ఉద్యమకారులు, కవుల రచనలు, మత సామరస్యానికి సంబంధించిన అంశాలూ తొలగిపోయాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

➡️