ఒపెక్‌ నుంచి వైదొలిగిన అంగోలా

Dec 23,2023 10:33 #opec

న్యూఢిల్లీ : పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఒపెక్‌) నుంచి తాము వైదొలుగుతున్నట్లు అంగోలా దేశం ప్రకటించింది. ”మేము 2006లో ఒపెక్‌లో స్వచ్ఛందంగా చేరాము. ఇప్పుడు కూడా స్వచ్ఛందంగానే నిష్క్రమించాలని నిర్ణయించుకున్నాము. ఇది ఆలోచించకుండా.. హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు” అని అంగోలా చమురు శాఖ మంత్రి డయామంటినో పెడ్రో అజెవెడో పేర్కొన్నారు. చమురు ఉత్పత్తి కోటాపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ఆయన పేర్కొన్నారు. ఆ దేశ రాజధాని లువాండాలోని ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌లో అంగోలా ప్రెసిడెంట్‌ జోవా లౌరెన్కో అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశం తర్వాత ఈ నిర్ణయం ప్రకటించారు. ఒపెక్‌ సభ్యత్వం ఆఫ్రికన్‌ దేశ ప్రయోజనాలకు ఉపయోగపడదని అంగోలా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ”అంగోలా ఎల్లప్పుడూ తన బాధ్యతలను నెరవేర్చింది. అదే విధంగా ఒపెక్‌ను ఆధునీకరించడానికి, దాని సభ్యులకు ప్రయోజనాలను పొందడంలో సహాయం చేయడానికి అన్ని సమయాలలో పోరాడుతూనే ఉంది. కానీ.. అంగోలా ఒపెక్‌లో ఉండడం ద్వారా ఏమీ ప్రయోజనం పొందలేదు. మా ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఒపెక్‌ను వదిలివేయాలని నిర్ణయించుకుంది. మేము ఒపెక్‌లో కొనసాగితే అంగోలా ఉత్పత్తిని తగ్గించవలసి వస్తుంది. ఇది ఒప్పందాలను గౌరవించే మా విధానానికి విరుద్ధంగా ఉంటుంది. ఈ నిర్ణయం అంత తేలికగా తీసుకున్నది కాదు.” అని ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌ ప్రెస్‌ రూమ్‌లో అజెవెడో పేర్కొన్నారు. ఓపెక్‌ సభ్య దేశమైన అంగోలా రోజుకు 11 లక్షల బ్యారెల్స్‌ ముడి చమురును ఉత్పత్తి చేస్తుంది. ఆఫ్రికన్‌ ఖండంలో రెండవ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా ఉంది.

➡️