మేయర్‌ ‘రాజీనామానే’ సాక్ష్యం : కేజ్రీవాల్‌

Feb 19,2024 15:18 #Chandigarh Mayor, #Kejriwal, #Rigging

న్యూఢిల్లీ :   బిజెపి నేత మనోజ్‌ సోంకర్‌ రాజీనామాతో ఈ ఎన్నికల్లో రిగ్గింగ్‌ జరిగిందని రుజువైందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సోమవారం వ్యాఖ్యానించారు. చండీగఢ్‌ మేయర్‌ పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రిగ్గింగ్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణకు ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

”ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మేయర్‌ రాజీనామాతో స్పష్టమైంది. ఒకవేళ ఎన్నికల్లో గెలవకపోయినట్లైతే.. మా కౌన్సిలర్‌లను కొనుగోలు చేయడం, లేదా కూల్చడం చేసేవారు” కేజ్రీవాల్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

జనవరి 30న జరిగిన చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆప్‌ కౌన్సిలర్లకు చెందిన ఏడు ఓట్లను చెల్లనివిగా ప్రకటించి బిజెపి అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించారు. చెల్లని ఓట్లుగా ప్రకటించడం కోసం ప్రతిపక్ష కౌన్సిలర్ల బ్యాలెట్‌ పత్రాలపై ఎన్నికల అధికారి పిచ్చి గీతలు గీస్తున్న వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎన్నికల అక్రమాలను వ్యతిరేకిస్తూ ఆప్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ఎన్నికను ‘ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడంగా’ పేర్కొంటూ .. తదుపరి విచారణను ఈ నెల 19కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఆ రోజు ప్రిసైడింగ్‌ అధికారి వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

➡️