‘ఈ ‘ ఫలితాలు ఇండియా కూటమి పై ప్రభావం చూపవు : శరద్‌పవార్‌

Dec 3,2023 16:29 #INDIA bloc, #sharad pawar

 న్యూఢిల్లీ   :   ‘ఇండియా కూటమి’ సమావేశంపై నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ‘ఇండియా’ కూటమిపై ఎలాంటి ప్రభావం చూపబోవని అన్నారు.  ఢిల్లీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో త్వరలో తాము సమావేశం కానున్నామని అన్నారు.   క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉన్నవారితో మాట్లాడతామని, ఆ తర్వాతే ఈ ఫలితాలపై వ్యాఖ్యానించగలమని శరద్‌ పవార్‌ పేర్కొన్నారు.

తెలంగాణ ఫలితాలపై కూడా ఇప్పుడే స్పందించడం తొందరపాటు చర్యే అవుతుందని చెప్పారు.  తెలంగాణలో బిఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. అయితే, రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’కు రాష్ట్రంలో విశేష స్పందన లభించిందని, ఈ యాత్రతో స్థానికంగా మార్పు వస్తుందని భావించామని, అలాగే జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల ఫలితాలు ‘ఇండియా’ కూటమిపై ప్రభావం చూపుతాయని తాను భావించడం లేదని అన్నారు.  ప్రస్తుత పరిణామాలు బిజెపికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.

నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు దిశగా దూసుకెళ్తుండగా.. మిగతా మూడు రాష్ట్రాల్లో మాత్రం బిజెపి విజయం దిశగా వెళుతోంది.

➡️