విదేశీయులపై హత్యాయత్నం చేయడం.. గీత దాటడమే

  • అమెరికా రాయబారి ఎరిక్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ : ఒక దేశానికి చెందిన పౌరుడిని హత్య చేసేందుకు మరో దేశానికి చెందిన ప్రభుత్వం లేదా దాని అధికారులు ప్రయత్నించడం గీత దాటడమే అవుతుందని, ఆ పని సరికాదని భారత్‌లో అమెరికా రాయబారిగా పనిచేస్తున్న ఎరిక్‌ గార్సెట్టీ వ్యాఖ్యానించారు. అమెరికాలో సిక్కు వేర్పాటువాది గుర్‌పత్‌వంత్‌ సింగ్‌ పన్నన్‌ను హత్య చేసేందుకు జరిగిన కుట్రను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఎరిక్‌ ఆదివారం ఎఎన్‌ఐ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ అంశం సార్వభౌమత్వానికి, హక్కులకు సంబంధించిందని చెప్పారు. గీత దాటడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు. పన్నన్‌ ఉగ్రవాది అని భారత్‌ చెబుతున్నప్పుడు ఆయనను అమెరికా ఎందుకు రక్షిస్తోందని ప్రశ్నించగా, భావ ప్రకటనా స్వేచ్ఛ రెండు దేశాలలో వేర్వేరుగా పనిచేస్తుందని ఎరిక్‌ తెలిపారు. పన్నన్‌ను తామేమీ వెనకేసుకురావడం లేదని అన్నారు. ఆయనపై మోపిన ఆరోపణలు అక్కడి చట్టాల ప్రకారం నిరూపితం కావాల్సి ఉన్నదని చెప్పారు. ఎరిక్‌ వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జైశంకర్‌ స్పందిస్తూ అది అమెరికా అభిప్రాయమై ఉంటుందని అన్నారు. భారత్‌కు సంబంధించినంత వరకూ తమ వద్ద ఉన్న సమాచారం ఆధారంగా విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ విచారణలో భారత భద్రతా ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయని తెలిపారు.

➡️