కేరళలో మెరుగైన జీవన ప్రమాణం

Jan 2,2024 10:42 #Better standard, #kerala, #living
  • దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే తన ప్రజలకు అండగా ఉంది
  • ప్రతి పౌరుడి ప్రాథమిక అవసరాలకు హామీ ఇవ్వొచ్చని నిరూపించింది
  • వ్యవసాయాభివృద్ధిలో భూ సంస్కరణల కీలక పాత్ర
  • కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళ వామపక్ష ప్రభుత్వం తన ప్రజలకు దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన జీవన ప్రమాణాలను అందించగలిగిందని కేరళ మాజీ ఆర్థికశాఖ మంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త థామస్‌ ఐజాక్‌ అన్నారు. సోమవారం ఛండీగఢ్‌లోని సెక్టార్‌ 29 డి లోని భక్నా భవన్‌లో పంజాబీ డైలీ దేశ్‌ సేవక్‌ 29వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా థామస్‌ ఐజాక్‌ ప్రసంగించారు. ప్రస్తుత ఆర్థికాభివృద్ధిలో మన దేశంలోని ప్రతి పౌరుడికి ప్రాథమిక అవసరాలకు హామీ ఇవ్వొచ్చని కేరళ నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. తక్కువ స్థాయి ఆర్థిక వృద్ధిలో కూడా కేరళ ఉన్నత స్థాయిని ఎలా సాధించగలిగిందో ఆయన వివరించారు. శ్రేయస్సు అనేది వృద్ధిపై మాత్రమే కాకుండా అది ఎలా పునఃపంపిణీ చేయబడుతుందనే దానిపై ఆధారపడి ఉంటుందని, కేరళ సంక్షేమం దాని పునర్విభజన వ్యూహం ఫలితంగానే జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేరళ, జాతీయ సగటు మధ్య తేడాను వివరిస్తూ కొన్ని గణాంకాలను విశ్లేషించారు. కేరళలో అక్షరాస్యత 96.2 శాతం, శిశు మరణాలు 7, ప్రసూతి మరణాలు 43, ఆయుర్దాయం 76.4, లింగ నిష్పత్తి 1,082, తలసరి ఆదాయం రూ.2,16,749 ఉందని తెలిపారు. అదే జాతీయ సగటు చూస్తే అక్షరాస్యత 77.7 శాతం, శిశు మరణాలు 32, ప్రసూతి మరణాలు 113, ఆయుర్దాయం 70.9, లింగ నిష్పత్తి 945, తలసరి ఆదాయం రూ.1,45,680 ఉందని వివరించారు. జనాభా పెరుగుదలకు సంబంధించి జాతీయ సగటు 9.0కి ఉందని, కేరళలో ఇది కేవలం 5.2 అని అన్నారు. జనన రేటు గణాంకాలు కేరళలో 12.2 ఉండగా, జాతీయ సగటు 16 అని చెప్పారు.

వ్యవసాయాభివృద్ధిలో భూ సంస్కరణలు కీలక పాత్ర

వ్యవసాయాభివృద్ధిలో భూ సంస్కరణలు కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఇంతకముందు 70 శాతం భూమి కేవలం 5 శాతం ప్రజలతో ఉండేది. ప్రజలు విద్యకు పెద్దపీట వేశారని వివరించారు. కేరళలో వడ్రంగి లేదా ప్లంబర్‌ అయినా కూడా సంపాదన కోసం విదేశాలకు వెళ్లేందుకు కమ్యూనికేషన్‌కు అవసరమయ్యే ఇంగ్లీషు చదవడం, రాయడం వచ్చునని తెలిపారు. 20 లక్షల మంది వలసదారులతో గల్ఫ్‌ దేశాల్లో ఉన్నవారు చెల్లింపులు వాటా జిఎస్‌డిపిలో 30 శాతం అని ఆయన వెల్లడించారు.డైలీ దేశ్‌ సేవక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుఖ్విందర్‌ సింగ్‌ సెఖోన్‌ మాట్లాడుతూ.. 1920లో వార్తాపత్రిక ప్రచురితమైనపుడు బ్రిటీష్‌ ప్రభుత్వం పదే పదే ఆ వార్తాపత్రిక సంపాదకులను అరెస్టు చేయడంతో మూతపడాల్సి వచ్చిందని అన్నారు. కామ్రేడ్‌ హరి కిషన్‌సింగ్‌ సుర్జీత్‌ దాని ప్రచురణను పునరుద్ధరించడానికి చిత్తశుద్ధితో ఎలా ప్రయత్నించారో, చివరికి ఛండీగఢ్‌లోని దాని ప్రస్తుత ప్రాంగణంలో 1996 జనవరి 1 నుండి దాని ప్రచురణను ఎలా ప్రారంభించారో ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో దేశ్‌ సేవక్‌ మేనేజింగ్‌ కమిటీ సభ్యులు గురుదర్శన్‌ సింగ్‌ ఖాస్పూర్‌, భూప్‌ చంద్‌ చన్నో తదితరులు పాల్గొన్నారు.

➡️