ఎంఎస్‌పి అమల్జేయకపోతే ఎంఎస్‌కు భారతరత్న గౌరవం అసంపూర్ణం 

Bharat Ratna honor for MS is incomplete if MSP is not implemented
  • స్వామినాథన్‌ సిఫారసును కేంద్రం అమల్జేయాలి
  • కేంద్రానికి సామాజిక కార్యకర్త ఇఎఎస్‌ శర్మ బహిరంగ లేఖ

న్యూఢిల్లీ : ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు కేంద్రం ఇటీవల భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో సామాజిక కార్యకర్త, మాజీ బ్యూరోక్రాట్‌ ఇఎఎస్‌ శర్మ స్పందించారు. డాక్టర్‌ స్వామినాథన్‌ ప్రతిపాదించిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ఫార్ములాను అమలు చేయకపోతే ఆయనకు ప్రకటించిన భారతరత్న గౌరవం అసంపూర్ణమవుతుందని ఆయన పేర్కొన్నారు. స్వామినాథన్‌ కమిటీ ప్రతిపాదించిన ఎంఎస్‌పీని అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్రానికి ఒక బహిరంగ లేఖను రాశారు. స్వామినాథన్‌ కమిటీ ఫార్ములాను అమలు చేయాలనే డిమాండ్‌ను దేశవ్యాప్తంగా ఉన్న రైతులు నిరంతరం వినిపిస్తున్న విషయం విదితమే. ముఖ్యంగా, కేంద్రం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపినపుడు అన్నదాతలు స్వామినాథన్‌ కమిటీ ప్రతిపాదనను అమలు చేయాలని తమ వాదనను గట్టిగా వినిపించారు. ఆ సమయంలో మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకున్న మోడీ సర్కారు.. స్వామినాథన్‌ కమిటీ ప్రతిపాదనను అమలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చింది. వీటితో పాటు మరికొన్ని వాగ్దానాలనూ చేసింది. అయితే, స్వామినాథన్‌ కమిటీ సిఫారుసులతో పాటు ఇతర వాగ్దానాలనూ కేంద్రం అమలు చేయకపోవటం గమనార్హం. ప్రస్తుతం స్వామినాథన్‌కు భారతరత్నను ప్రకటించటంతో ఆయన చేసిన సిఫారసుల అమలు మళ్లీ చర్చకు దారి తీస్తున్నది. ‘డాక్టర్‌ స్వామినాథన్‌ కమిటీ విధానంలో హేతుబద్ధత స్పష్టంగా ఉన్నది. ఈ విధానంపై ఆధారపడిన ఎంఎస్‌పి.. వ్యవసాయం నుంచి వ్యవసాయేతర కార్యకలాపాలకు వలసలు లేకుండా, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర పనులకు మళ్లించకుండా నిర్ధారిస్తుంది’ అని కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్‌ గౌబాకు రాసిన లేఖలో ఇఎఎస్‌ శర్మ పేర్కొన్నారు. దేశంలోని తీవ్రమైన నిరుద్యోగ సమస్య రైతు సమాజం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడుతుందని ఆయన వివరించారు. వివిధ పంటలు, ప్రత్యేకించి ఆహార పంటల ఎంఎస్‌పిని నిర్ణయించటానికి స్వామినాథన్‌ సిఫారసు చేసిన ప్రాతిపాదికను పూర్తిగా అనుసరించటమే వ్యవసాయానికి డాక్టర్‌ స్వామినాథన్‌ చేసిన కృషిని గుర్తించటానికి ప్రభుత్వానికి అత్యంత సరైన మార్గమని ఇఎఎస్‌ శర్మ తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

➡️