లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌

Jun 20,2024 23:31 #loksabha, #pro tem speaker

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా భర్తృహరి మహతాబ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ సందర్భంగా గురువారం ఆయనతో రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. కొత్తగా ఎంపికైన ఎంపిలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోనున్నారు. భర్తృహరి మహతాబ్‌ ఒరిస్సాలోని కటక్‌ నుంచి ఎంపిగా ఏడోసారి గెలుపొందారు. గతంలో ఆయన నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజెడి పార్టీలో కొనసాగారు. ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు. ఆయన మాజీ సిఎం హరేకృష్ణ మహతాబ్‌ తనయుడు. మహతాబ్‌ నియామకంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు సోషల్‌ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 95(1) ప్రకారం ఎంపి భర్తృహరి మహతాబ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం సంతోషంగా ఉందన్నారు.

➡️