బిగ్‌ పోల్‌

Apr 9,2024 03:50

ప్రపంచంలోకెల్ల అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ మన భారతదేశానిది. అతిపెద్ద రాజ్యాంగం, అతిపెద్ద పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా మనదే. ఈ మధ్యనే జనాభాలోనూ చైనాను వెనక్కినెట్టి మన దేశం మొదటి స్థానంలోకి వచ్చింది. అంతటి పెద్ద ప్రజా బాహుళ్యం ఐదేళ్లకోమారు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొని తమకు నచ్చిన, తమకు మేలు చేసే ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు ఓటు. ఓటు అనే ఆయుధాన్ని ఎక్కుపెట్టే సమయం వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల సమరానికి మార్చి 16న నగారా మోగించింది. షెడ్యూల్‌ను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలు దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 543 స్థానాల్లో జరగుతున్నాయి. వీటితోపాటే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకూ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే రాజీనామాలు, మరణాలు, అనర్హత వేటు వంటి కారణాలతో ఖాళీ అయిన 26 శాసనసభ స్థానాలకూ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది ఇసి.

మహా యజ్ఞం
ఇంతపెద్ద దేశంలో ఎన్నికలు నిర్వహించడం ఆషామాషీ వ్యవహారం కాదు. అదొక మహా యజ్ఞం. 2024 జనవరి నాటికి ఇసి తాజా పర్చి ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం దేశంలో 97 కోట్ల ఓటర్లున్నారు. ఇంత మంది ఓటర్లు ప్రపంచంలో మరెక్కడా లేరు. మొత్తం ఓటర్లలో సగం, అంతకంటే ఎక్కువ మహిళా ఓటర్లుండటం విశేషం. 2019 ఎన్నికల్లో 89.6 కోట్ల మంది ఓటర్లుండగా ఇప్పటికొచ్చేసరికి 7.28 కోట్ల ఓటర్లు పెరిగారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన 18-19 ఏళ్ల వయసు నవయువకులు 1.84 కోట్లు. మొత్తం ఓటర్లలో వారిది 1.89 శాతం. ఇంత పెద్ద సంఖ్యలో కొత్త ఓటర్లు రావడం రికార్డే. అమెరికా అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటుంది. కానీ ఆ దేశం ప్రజాస్వామ్య వ్యవస్థలోకొచ్చాక దాదాపు గడచిన వందేళ్ల ముందు వరకు కూడా మహిళలకు ఓటు హక్కు లేదు. కానీ మన రాజ్యాంగం దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి ఎన్నికల నుంచీ పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చింది. ఇది మన రాజ్యాంగం గొప్పతనం. ప్రజాప్రాతినిధ్యచట్టానికి సవరణలు చేసి ట్రాన్స్‌జెండర్లకూ ఓటు హక్కు కల్పించారు. దేశ వ్యాప్తంగా 48 వేల మంది వరకు ట్రాన్స్‌జెండర్లు ఓటర్లుగా నమోదయ్యారు. సర్వీస్‌ ఓటర్లు 19 లక్షలకుపైన ఉన్నారు. శతాధిక వయసు కలిగిన ఓటర్లు రెండు లక్షలకుపైన ఉన్నారు. 85 ఏళ్లకుపైన ఉన్న సీనియర్‌ సిటిజన్‌ ఓటర్లు 81 లక్షలకుపైన ఉన్నారు. ఇంత మంది శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇసి ఎప్పటికప్పుడు ప్రక్రియలో మార్పులు చేస్తూ వచ్చింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. బ్యాలెట్‌ పత్రాల స్థానంలో ఇవిఎంలు వచ్చాయి. వాటిపై అనుమానాలు రావడంతో వివిప్యాట్‌లు వచ్చాయి. వాటిపైనా సందేహాలు వస్తున్నాయి. అన్ని వివిప్యాట్‌ స్లిప్‌లనూ లెక్కించాలన్న డిమాండ్‌ ముందుకొచ్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉంది. అలాగే ఇవిఎంల పనితీరులో ప్రస్తుతం ఉన్న సీక్వెన్స్‌ను మార్చాలన్న సూచనలూ వస్తున్నాయి. ఇవిఎంలపై వస్తున్నవి సందేహాలే తప్ప నిరూపించదగిన స్పష్టమైన ఆధారాలు ఇప్పటి వరకు లేవు. ఇవిఎంలను ట్యాపరింగ్‌ చేయలేరని ఇసి చెబుతోంది.

మోడీ మరక
ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన ఇసి స్వతంత్రత ప్రశ్నార్ధకం కావడం ఆందోళనకరం. ఇసిని బిజెపి ప్రభుత్వం ప్రభావితం చేస్తోందనడానికి పలు ఉదాహరణలే ఉన్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందనడానికి ఇటీవల చేసిన చట్ట సవరణే నిదర్శనం. ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో గతంలో సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ సభ్యునిగా ఉండేవారు. కొత్త చట్టంలో సిజెఐని మోడీ సర్కారు తప్పించింది. ప్రధాని, కేంద్ర ప్రభుత్వంలోని కేబినెట్‌ మంత్రి ఒకరు, ప్రతిపక్ష నేత మాత్రమే ఉంటారు. అప్పుడు మెజార్టీ ప్రభుత్వానిదే అవుతుంది. వారి అనుకూలురే కమిషనర్లుగా ఎంపిక అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్యన ఎన్నికల కమిషనర్ల రాజీనామాలు, నియామకాలు వివాదాస్పదమయ్యాయి. ఇదిలా ఉండగా ప్రస్తుత బిజెపి ప్రభుత్వంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయో లేదోనన్న శంక అంతర్జాతీయంగా నెలకొంది. అందుకే ఇక్కడి ఎన్నికల ప్రక్రియ పరిశీలనకు అంతర్జాతీయంగా ఒక కమిటీ ఏర్పడటంబట్టి దేశంలో ఎన్నికలపై ఉన్న అనుమానాల తీవ్రతేమిటో అర్థమవుతుంది.

ఏడు దశలు
దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఇసి ఏర్పాట్లు చేసింది. బీహార్‌, యుపి, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో ఏడు దశల్లో పోలింగ్‌ ఉంది. తొలి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 19న జరుగుతుండగా, చివరి దశ పోలింగ్‌ జూన్‌ 1న నిర్వహిస్తున్నారు. దేశం మొత్తమ్మీద లోక్‌సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జూన్‌ 4న జరుగుతుంది. అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు మాత్రం జూన్‌ 2న పూర్తి చేస్తారు. అక్కడ లోక్‌సభ ఓట్ల లెక్కింపు జూన్‌ 4నే ఉంటుంది.

➡️