ఉత్తరప్రదేశ్‌లో దళితులపై బిజెపి దమనకాండ

Mar 6,2024 10:05 #against, #BJP, #Dalits, #Uttar Pradesh
  • పార్క్‌ అభివృద్ధి పేరిట జరిగిన దారుణంపై సిపిఎం దిగ్భ్రాంతి
  • పోలీసు కాల్పుల్లో చనిపోయిన విద్యార్థి కుటుంబానికి పరామర్శ

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లో దళితులపై బిజెపి ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని సిపిఎం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రాంపూర్‌ జిల్లాలో సిలారు బరగావ్‌ గ్రామంలో పార్కు అభివృద్ధి పేరిట ఇటీవల అక్కడి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం పోలీసులతో స్థానికులపై తీవ్ర అణిచివేత దాడులకు పాల్పడింది. లాఠీఛార్జీ, కాల్పులతో విరుచుకుపడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 27న జరిగిన ఈ దుర్మార్గమైన దాడిలో పదో తరగతి చదువుతున్న సోమేష్‌ కుమార్‌ అనే ఒక దళిత విద్యార్థి చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బాధిత దళిత కుటుంబాలను సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు సుభాషిణీ అలీ నేతృత్వంలోని బృందం ఈ నెల 4న పరామర్శించి ధైర్యం చెప్పింది. న్యాయం జరిగేవరకూ తమతో కలిసి పోరాడుతామని భరోసా కల్పించింది. కాల్పుల్లో మరణించిన విద్యార్ధి సోమేష్‌ కుటుంబానికి తక్షణమే నష్టపరిహారం చెల్లించి, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. ఈ బృందంలో పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు విక్రమ్‌ సింగ్‌, మొరదాబాద్‌ జిల్లా కార్యదర్శి థాన్‌ సింగ్‌, రాంపూర్‌ జిల్లాకి చెందిన జావేద్‌ ఖాన్‌, షాబూ ఖాన్‌ వున్నారు.

యోగి సర్కార్‌ మనువాదీ దుర్మార్గమే

                ఈ మొత్తం వ్యవహారంలో జరిగిందంతా చాలా దారుణమైనదని, రాంపూర్‌ అధికార యంత్రాంగం నిర్లక్ష్యమే ఇందుకు కారణమని సిపిఎం ప్రతినిధి బృందం అభిప్రాయపడింది. పైగా ఇదంతా మాఫీ చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఎస్‌డిఎంని, ఒక పోలీసు అధికారిని బదిలీ చేశారు. కానీ అదేమి శిక్ష కాదని ప్రతినిధి బృందం వ్యాఖ్యానించింది. యుపి ప్రభుత్వ మనువాదీ, అణచివేత పార్శ్వాన్ని బహిర్గతం చేస్తున్న ఈ సంఘటనను సిపిఎం ఖండిస్తోందని ప్రతినిధి బృందం ఒక ప్రకటనలో పేర్కొంది. నష్టపరిహారంగా సోమేష్‌ కుటుంబానికి కోటి రూపాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేసింది. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగమివ్వాలని కోరింది. అంబేద్కర్‌ పార్క్‌ను నిర్మించి, అందులో అంబేద్కర్‌ విగ్రహంతో పాటూ సోమేష్‌ కుమార్‌ విగ్రహాన్ని కూడా పెట్టాలని డిమాండ్‌ చేసింది.

➡️