బిజెపి, దాని మిత్రపక్షాలను ఓడించండి

Apr 5,2024 00:13 #Communist Manifesto, #CPIM
  • లోక్‌సభలో సిపిఎం, వామపక్ష పార్టీల బలాన్ని పెంచండి
  • కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకిక ప్రభుత్వ ఏర్పాటుకు కృషి
  • రాజ్యాంగం, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ
  • ఉపా వంటి క్రూర చట్టాల రద్దు
  • ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రజలకు సిపిఎం పిలుపు

న్యూఢిల్లీ: బిజెపి, దాని మిత్రపక్షాలను ఓడించాలని, లోక్‌సభలో సిపిఎం, వామపక్షాల బలాన్ని పెంచాలని, కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకికవాద ప్రభుత్వం ఏర్పడేలా చూడాలని సిపిఐ(ఎం) పిలుపునిచ్చింది. లోక్‌సభ ఎన్నికల కోసం సిపిఎం ఎన్నికల ప్రణాళికను ఆ పార్టీ ప్రధాన  కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌, బృందాకరత్‌, నీలోత్పల్‌ బసు తదితరులతో కలసి గురువారం నాడిక్కడ విడుదలజేశారు. ప్రజల కోసం చేపట్టాల్సిన ప్రజానుకూల, ప్రత్యామ్నాయ విధానాలను ఆ మ్యానిఫెస్టో వివరించింది.
కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం దశాబ్ద కాలంగా సాగించిన పాలనతో లౌకికవాద, ప్రజాస్వామ్య, భారత రిపబ్లిక్‌ ఉనికే ప్రమాదంలో పడిన నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యాంగానికి నాలుగు మూల స్తంభాలుగా భావించే లౌకికవాద ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమత్వం, సమాఖ్యవాదం, సామాజిక న్యాయం వ్యవస్థలను ఒక పద్ధతి ప్రకారం ధ్వంసం చేసే క్రమాన్ని ఈనాడు భారత్‌ చూస్తోంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, పార్లమెంట్‌లో తనకున్న మెజారిటీని దుర్వినియోగం చేస్తూ, నిరంకుశవాద, మతోన్మాద మోడీ ప్రభుత్వం దేశంలోని కార్మికుల హక్కులను నాశనం చేసేందుకు ఫాసిస్ట్‌ పద్దతులను ఉపయోగిస్తోంది. తద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత అసమానతలతో కలిగిన సమాజాల్లో ఒకటిగా మారుస్తోంది. మరోపక్క ప్రజలను మతపరంగా విభజించేందుకు విషపూరితమైన తన మతోన్మాద సిద్ధాంతాలను ప్రయోగిస్తోంది. ఈ నేపథ్యంలో 18వ లోక్‌సభకు జరిగే ఎన్నికలు కీలకమైన ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారత రాజ్యాంగం ద్వారా నిర్దేశించబడిన భారత రిపబ్లిక్‌ యొక్క లౌకిక, ప్రజాస్వామ్య స్వభావాన్ని పరిరక్షించడానికి ఎన్నికల్లో”ప్రజలమైన మనం” మన ఓటు ద్వారా ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించాలి. ఆ విషయంలో మనం ఎలాంటి పొరపాట్లు చేయరాదు – భారత రిపబ్లిక్‌ లౌకిక, ప్రజాస్వామ్య స్వభావాన్ని – పూర్తిగా ఆవేశంతో కూడిన, అసహనం, విద్వేషం, హింసల ప్రాతిపదిక కలిగిన నిరంకుశవాద, ఫాసిస్ట్‌, హిందూత్వ దేశం – గా మార్చేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. దేశంలోని ప్రతి వ్యవస్థలోనూ అనూహ్యమైన రీతిలో చొచ్చుకుపోయి భారతదేశ ప్రజల నరాల్లోకి తన మతోన్మాద విషాన్ని వ్యాపింపచేస్తున్న బిజెపి మూల సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌ బహిరంగంగా ప్రకటిస్తున్న లక్ష్యం ఇదే. ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా భారతదేశాన్ని కాపాడేలా ఈ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి.
గత లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పటి నుండి ఈ ఐదేళ్లలో, భారత్‌ కూడా అనేక పోరాటాలను చూసింది, కార్మికులు, రైతులు, ఆదివాసీలు, దళితులు, మహిళలు, యువత, విద్యార్ధుల ప్రజాస్వామ్య పోరాటాల ద్వారా తీవ్ర ప్రతిఘటనను చవి చూసింది. ప్రజలు ఐక్యంగా వుండి పోరాడితే ఈ ప్రభుత్వం సాగించే అణచివేతను, అధికారాన్ని శక్తి సామర్ధ్యాలను ఈ పోరాటాలు సవాలు చేయగలవని, ఓడించగలవని రుజువైంది. ముఖ్యంగా రైతుల చారిత్రక పోరాటం దీన్ని రుజువు చేసింది కూడా. ఇదే కాలంలో, సిపిఎం నేతృత్వంలో వామపక్ష ప్రజాస్వామ్య సంఘటన (ఎల్‌డిఎఫ్‌) ప్రభుత్వం అమలు చేసిన ప్రత్యామ్నాయ విధానాలను కూడా మనం చూశాం. ఆర్థికపరంగా చిక్కుల్లో పడేయడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కేరళ ఎల్‌డిఎఫ్‌ ప్రభుత్వం ప్రజానుకూల విధానాలకు, మత సామరస్యతకు ఒక ఆశా కిరణంగా ఆవిర్భవించింది.

  • బిజెపి దాని మిత్రపక్షాలను ఓడించడమే ప్రతి దేశభక్తుని కర్తవ్యమన్న స్పష్టమైన అవగాహనతో సిపిఎం తన ఎన్నికల ప్రణాళికను భారతదేశ ప్రజల ముందుంచుతోంది. ఈ సమిష్టి కర్తవ్యాన్ని బలోపేతం చేసేందుకు, కేంద్రంలో లౌకికవాద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో సాయపడేందుకు తన శక్తివంచన లేకుండా పాటు పడుతుందని సిపిఎం ప్రతిన చేస్తోంది. ఇందుకు గానూ, ప్రజానుకూల విధానాలకు హామీ కల్పించేందుకు గానూ పార్లమెంట్‌లో సిపిఎం బలమైన ఉనికిని కలిగివుండడం అత్యవసరం.
  • రాజకీయాలు, రాజ్యం, ప్రభుత్వం, పాలన నుండి మతాన్ని వేరు చేయాలన్న సూత్రం పట్ల తన నిబద్ధతను ప్రకటిస్తూ, దీని కోసం రాజీలేని పోరాటం సాగిస్తామని సిపిఎం ప్రతిన చేస్తోంది. విద్వేష ప్రసంగాలు, నేరాలకు వ్యతిరేకంగా చట్టం కోసం పోరాడుతుంది. సిఎఎను రద్దు చేసేందుకు కూడా కట్టుబడి వుంది.
  •  యుఎపిఎ, పిఎంఎల్‌ఎ వంటి అన్ని నిరంకుశ చట్టాలను రద్దు చేసేందుకు సిపిఎం నిలబడుతుంది. స్వతంత్ర సంస్థల స్వయంప్రతిపత్తిని పరిరక్షిస్తూ, బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడానికి, ప్రజల ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు కట్టుబడి వుంది.
  •  భారతదేశ ఆర్థిక సార్వభౌమాధికారాన్ని కాపాడే విధానాలకు సిపిఎం కట్టుబడి వుంది. ప్రభుత్వరంగ ప్రైవేటీకరణను పునస్సమీక్షించి, తిప్పికొట్టాలి. కుబేరులపై పన్ను విధించడంతో పాటూ సాధారణ సంపద పన్నును, వారసత్వ పన్నును కూడా చట్టబద్ధం చేయాల్సి వుంది. ప్రస్తుత లేబర్‌ కోడ్‌ల స్థానంలో కార్మికుల హక్కులు ప్రతిబింబించేలా కార్మిక అనుకూల చట్టాలు వుండాలి. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)కు చట్టబద్ధమైన హామీ కల్పించడం ద్వారా భారతదేశ రైతాంగానికి భద్రత కల్పించడంపైనే ఆహార భద్రత ఆధారపడి వుంటుంది.  పని హక్కును రాజ్యాంగ హక్కుగా చేర్చాలని సిపిఎం కోరుతోంది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి. అదనంగా ఉద్యోగాలను సృష్టించగలిగేలా ఎంఎస్‌ఎంఇలను బలోపేతం చేసి, విస్తరించాలి. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎకు బడ్జెట్‌లో కేటాయింపులను రెట్టింపు చేయాలి. పట్టన ఉపాధికి హామీ కల్పిస్తూ కొత్త చట్టాన్ని రూపొందించాలి. నిరుద్యోగ భృతిని కల్పించాలి. ఉపాధి నష్టంతో కూడిన వృద్ధికి సంబంధించిన ప్రస్తుత విధానాల్లో మార్పు తీసుకురావడం ద్వారా భారతదేశ ప్రజల లాభాలను నాశనం చేయడాన్ని తప్పనిసరిగా మార్చాలి.
  •  సార్వజనీన విద్యా హక్కును బలోపేతం చేయాలి, ఉన్నత విద్య ప్రైవేటీకరణను ఆపాలి.
  •  విద్యా రంగానికి బడ్జెట్‌లో కేటాయింపులు జిడిపిలో కనీసం ఆరు శాతానికి పెంచాలని సిపిఎం కోరుతోంది. వాణిజ్యకీకరణ, మతతత్వకరణ, కేంద్రీకరణ విధానాలను తిప్పికొట్టడానికి కట్టుబడి వుంది.
    మోడీ ప్రభుత్వం తీవ్రంగా నీరుగార్చిన రాష్ట్రాల రాజ్యాంగ హక్కుల పునరుద్ధరణకు సిపిఎం గట్టిగా నిలబడివుంది. కేంద్రం వసూలు చేసే సర్‌చార్జీలు, సెస్సుల్లో వాటాలతో సహా మొత్తం కేంద్ర పన్నుల్లో 50శాతాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని సిపిఎం కోరుతోంది. రాష్ట్రాలను పణంగా పెట్టి కేంద్రీకరణను పెంపొందించే విధానాలకు స్వస్తి పలకాలని కోరుతోంది. అలాగే ముఖ్యమంత్రి ప్రతిపాదించే ముగ్గురు నిపుణుల కమిటీ నుండే గవర్నర్‌ను ఎంపిక చేయడానికి సిపిఎం కట్టుబడివుంది
  •  ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కోసం చట్టాన్ని రూపొందించేందుకు సిపిఎం కట్టుబడి వుంది. ఎలాంటి నీరుగార్చకుండా రిజర్వ్‌డ్‌ పోస్టుల్లో ఖాళీల తక్షణ భర్తీకి, ఆదివాసీల రాజ్యాంగ, చట్టబద్ధమైన హక్కుల పరిరక్షణకు, సాంస్కృతిక సమీకరణ ముగింపునకు కట్టుబడి వుంది. దేశంలో ఒబిసిలపై సక్రమ డేటాను పొందడానికి గానూ ఎన్నాళ్ళగానో చేపట్టాల్సి వున్న 2021 సాధారణ జనగణనతో పాటూ కుల గణన కూడా నిర్వహించడం అవసరం. మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లను తక్షణమే అమలు చేసేందుకు, నేరాల్లో మహిళా బాధితులకు న్యాయం అందించే క్రమాలను బలోపేతం చేయడానికి సిపిఎం కట్టుబడి వుంది.
  •  ఎన్నికల వ్యవస్థలో ధనబల వినియోగాన్ని అణచివేసేందుకు అత్యవసరంగా ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని సిపిఎం కోరుతోంది. ఇందుకు గానూ, ఎన్నికలకు ప్రభుత్వ నిధులనే ఉపయోగించాలని పార్టీ కోరుతోంది. రాజకీయ పార్టీలకు కార్పొరేట్లు విరాళాలు ఇవ్వడాన్ని నిషేధించాలని కోరుతోంది. ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరిచేందుకు కార్పొరేట్లు విరాళాలు ఇవ్వాలి. అటువంటి విరాళాలన్నీకూడా ప్రభుత్వ ఎన్నికల నిధిలో జమ చేయాలి. వాటిని ప్రభుత్వ నిధులుగా ఉపయోగించాలి.
  •  370వ అధికరణ ద్వారా జమ్మూ కాశ్మీర్‌కు మంజూరైన స్వయం ప్రతిపత్తి హౌదాకు సిపిఎం కట్టుబడి వుంది. జమ్మూ కాశ్మీర్‌ ప్రజల హక్కుల పరిరక్షించేందుకు గానూ ప్రతి వేదికను ఇందుకోసం ఉపయోగించుకోవడానికి సిపిఎం నిబద్ధతతో వుంది. రాష్ట్ర అసెంబ్లీకి తక్షణమే ఎన్నికలు నిర్వహించడానికి సిపిఎం కట్టుబడి వుంది. అలాగే ఈ దిశగా మొదటి చర్యగా పూర్తి స్థాయి రాష్ట్ర హౌదాను పునరుద్ధరించాలని కూడా కోరుతోంది.
  •  మన దేశ ప్రయోజనాలను నెరవేర్చే అలీన విదేశాంగ విధానానికి సిపిఎం కట్టుబడి వుంది. మన దేశ భద్రతకు సంబంధించిన ప్రతి కోణాన్ని పరిరక్షించుకుంటూనే మన పొరుగు దేశాలతో సత్సంబంధాలు వుండాలని భావిస్తోంది.
  •  ప్రజల జీవన ప్రమాణాలు అత్యంత దయనీయంగా దిగజారిపోవడాన్ని దృష్టిలోవుంచుకుని ఆశ్రిత పక్షపాతం, పెట్టుబడిదారీవాదం, మతం-కార్పొరేట్‌ సంబంధాలకు సంబంధించిన ప్రస్తుత దిశా నిర్దేశాన్ని పూర్తిగా సవరించాలి.
  •  సిపిఎం ప్రత్యామ్నాయ విధానాలను ఎన్నికల ప్రణాళిక రెండో భాగంలో ప్రజల ముందు సవివరంగా వుంచుతామని పేర్కొంది.
➡️